పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలకు గుడ్‌న్యూస్. మీరు తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం అయితే ఈ స్కాలర్‌షిప్‌కు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. సీబీఎస్‌ఈ ప్రకటించిన సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్ మీ కోసమే.
తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని చదువులో ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ ఈ స్కాలర్‌షిప్‌ను అందజేస్తోంది. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి సంబంధించిన అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్ 31, 2024వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలను విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా సీబీఎస్సీ సింగిల్ గర్ల్ చైల్డ్ మెరిట్ స్కాలర్‌షిప్‌ను యేటా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి కూడా దరఖాస్తులు అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా రూ.500ల చొప్పున రెండేళ్ల వరకు అంటే ఇంటర్మీడియల్ పూర్తయ్యేంత వరకు అందజేస్తారు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు తప్పనిసరిగా సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ప్రస్తుత విద్యా సంవత్సరం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 11, 12వ తరగతులు చదువుతూ ఉండాలి. పదో తరగతి పరీక్షల్లో కనీసం ఐదు సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు సాధించిన వారు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే దరఖాస్తు చేసుకునే విద్యార్థిని ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500కు మించి ఉండరాదు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 31, 2024వ తేదీతో ముగుస్తుంది. వచ్చిన దరఖాస్తులను ఆయా పాఠశాలలు నవంబర్ 7 వరకు వెరిఫికేషన్ చేస్తాయి. ఈ స్కాలర్‌షిప్‌కు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్ చేయించుకునే వారు కనీసం 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు 11వ తరగతితలో సాధించాలి. రెన్యువల్‌కు కూడా అక్టోబర్ 31ని గడువుగా నిర్ణయించారు.
ఆసక్తి, అర్హత ఉన్నవారు ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.