లడాయి లడఖ్‌లో సాధారణ పరిస్థితులు.. దీపావళికి స్వీట్లు తినిపించుకున్న చైనా-భారత సైన్యం

www.mannamweb.com


తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, డెప్సాంగ్ మైదానాలలో చైనా – భారత్ మధ్య రెండు సంఘర్షణ పాయింట్ల వద్ద దళాలను ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయింది.

సరిహద్దు వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునే దిశలో భారత్‌-చైనా ముందడుగు వేశాయి. LAC దగ్గర గస్తీపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే తూర్పు లడఖ్‌లో ఇప్పుడు బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. దీపావళి సందర్భంగా గురువారం(అక్టోబర్ 30) ఇరు సేనల నుంచి ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. ఆర్మీ నుండి అందిన సమాచారం ప్రకారం, భారత్ – చైనా మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం తర్వాత ఇది ప్రారంభమైంది.

తూర్పు లడఖ్‌లోని డెమ్‌చోక్, డెప్సాంగ్ మైదానాలలో చైనా – భారత్ మధ్య రెండు సంఘర్షణ పాయింట్ల వద్ద దళాలను ఉపసంహరించుకునే ప్రక్రియ పూర్తయింది. త్వరలో ఈ పాయింట్ల వద్ద సైన్యం పెట్రోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలోనే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం ఇరుపక్షాల మధ్య మిఠాయిలు పంచుకోనున్నట్లు సైన్యం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

సైన్యం ఉపసంహరణ తర్వాత ఇప్పుడు వెరిఫికేషన్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. రెండు సైన్యాల గ్రౌండ్ కమాండర్ల మధ్య పెట్రోలింగ్ విధివిధానాలు ఇంకా నిర్ణయించలేదు. చర్చల ప్రక్రియ పూర్తయిన తర్వాత, స్థానిక కమాండర్ స్థాయిలో చర్చలు ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెండు దేశాల మధ్య ఒప్పందానికి సంబంధించిన రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. మొదట దౌత్య స్థాయిలో ఇరుపక్షాలు సంతకం చేశాయి. తరువాత చైనా – భారత్ సైనిక అధికారుల మధ్య సైనిక స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. గత వారం కార్ప్స్ కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రెండు దేశాల ఒప్పందం ప్రత్యేకతలు ఖరారు చేశారు.

ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత ఉపసంహరణ ప్రక్రియను ఇరువర్గాలు ప్రారంభించాయి. భారత సైనికులు తమ పరికరాలను తిరిగి తీసుకురావడం ప్రారంభించారు. తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (LAC)పై ఒప్పందం తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పెట్రోలింగ్, బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. గత నాలుగేళ్లుగా ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. ఈ ఒప్పందం తర్వాత, ప్రతిష్టంభనను ముగించడంలో పెద్ద విజయం సాధించాయి.

2020 జూన్‌లో గాల్వన్ వ్యాలీలో చైనా – భారతదేశ సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణ తర్వాత భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గాల్వన్‌లో ఇరుపక్షాల మధ్య జరిగిన సైనిక ఘర్షణలు ఇటీవలి కాలంలో అత్యంత తీవ్రమైనవి. ఆర్మీ అధికారి ప్రకారం, రెండు దేశాల సైన్యాల మధ్య ప్రాంతాల పరిస్థితి, పెట్రోలింగ్ ఏప్రిల్ 2025 లోపు సాధారణ పరిస్థితికి తిరిగి వస్తుందని భావిస్తున్నారు.