కల్తీ నెయ్యిపై ఊపందుకున్న సిట్ దర్యాప్తు

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించినట్లు వచ్చిన ఆరోపణలపై నమోదైన కేసు విచారణ ఊపందుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లోని అధికారులు శుక్రవారం తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. కేసు దస్త్రాలు, ఆధారాలను పరిశీలించారు. సిట్ సభ్యులు ఐజీ త్రిపాఠి, సీబీఐ డీఐజీ మురళి రాంబా శనివారం తిరుపతి కార్యాలయానికి చేరుకుని, అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగించనున్నారు. లడ్డూ తయారీకి గుత్తేదారులు కల్తీనెయ్యి సరఫరా చేశారని తితిదే ప్రొక్యూర్‌మెంట్ జీఎం మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. దీనిపై సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్ దర్యాప్తు చేపట్టింది. సీబీఐ డైరెక్టర్‌ నామినేట్ చేసిన తిరుపతి జిల్లా అడ్మిన్‌ అదనపు ఎస్పీ వెంకట్రావు విచారణలో పాల్గొన్నారు. వెంకట్రావు పేరిట తితిదే మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్నను విచారణకు రావాలని నోటీసులు అందాయి. దానిపై హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ డైరెక్టర్‌ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అప్పటినుంచి కేసు దర్యాప్తులో వేగం తగ్గింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో దర్యాప్తు తిరిగి వేగం పుంజుకుంది. శుక్రవారం అదనపు ఎస్పీ వెంకట్రావు, కమిటీలోని సభ్యులు కార్యాలయానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. గతంలో సిట్లో పనిచేసిన డీఎస్పీ వెంకట్రామయ్య, నరసింగప్ప, శివనారాయణలను తొలగించారు. జిల్లాలోని కొందరు పోలీసుల సహకారంతో సిట్ దర్యాప్తు తిరిగి వేగం పుంజుకుంది.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.