ఆరు నెలల శిక్షణ.. ఆ వెంటే ఉద్యోగం

ఇంజినీరింగ్‌ కోర్సు పూర్తి చేసిన విద్యార్థినులకు బహుళజాతి సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగాలు వెంటనే లభించేందుకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ అధికారులు కొత్త పంథాను అనుసరిస్తున్నారు. ఈ ఏడాది కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పాసైన 40 మంది విద్యార్థినులకు నైపుణ్యాలు నేర్పించి, ఆరు నెలలు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఆపై ఉద్యోగాలు పొందేలా కార్యచరణను రూపొందించారు. ఇందుకోసం బెంగుళూరులోని ఎమర్టెక్స్‌ అనే ఐటీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్య, పరిశ్రమలను అనుసంధానించడం డీప్‌టెక్‌ డొమైన్లలో విద్యార్థులకు సంపూర్ణ అవగాహన కల్పించనున్నారు. శిక్షణ పూర్తయ్యాక ఒక్కొక్కరికి రూ.4.5 లక్షలు నుంచి రూ.6 లక్షల వార్షిక వేతనం లభించనుందని అధికారులు తెలిపారు.


పేద వారిని ప్రోత్సహించేందుకు..

జేఎన్‌టీయూ క్యాంపస్, అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చదివిన పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ విద్యార్థినులను ప్రోత్సహించేందుకు జేఎన్‌టీయూ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. క్యాంపస్‌ ఇంటర్వూలలో కొద్దిపాటి తేడాతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చేజార్చుకున్న విద్యార్థినులు వృత్తిపరంగా స్థిర పడేందుకు ఎమర్టెక్స్‌ సంస్థను అధికారులు ఎంచుకున్నారు. బెంగుళూరు కేంద్రంగా 22 ఏళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ ఎలక్ట్రానిక్స్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో భాగస్వామిగా కొనసాగుతోంది. పరిశ్రమ ఆధారిత శిక్షణను అందించడం, ప్రఖ్యాత కంపెనీలు, సంస్థల్లో ఉద్యోగ అకాశాలు లభించేలా సహకరించడం వంటి పనులను ఈ సంస్థ కొన్నేళ్ల నుంచి చేస్తోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.