Smart TV: 10 నిమిషాల్లో కొత్త స్మార్ట్‌ టీవీ మీ ఇంట్లో ఉంటుంది.. ఎలాగంటే.

ఆన్‌లైన్‌ షాపింగ్ రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు హోం డెలివరీ అంటేనే వింతగా చూసే వారు. కానీ ప్రస్తుతం ప్రతీ ఒక్క వస్తువు నేరుగా ఇంటి గడప వద్దకే వస్తోంది. అయితే క్విక్‌ కామర్స్‌ రాకతో కేవలం 10 నిమిషాల్లోనే వస్తువులు హోం డెలివరీ అవుతున్నాయి. తాజాగా ఈ రంగంలోనూ సంచలనలు జరుగుతున్నాయి..


దేశంలో ఈకామర్స్‌ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. వస్తువును ఆర్డర్‌ చేసిన 10 నిమిషాల్లోనే హోం డెలివరీ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. అయితే మొదట్లో కేవలం కిరాణ సామాన్లకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు క్రమంగా ఇతర వస్తువులకు కూడా విస్తరిస్తాయి. ఈకామర్స్ దిగ్గజ సంస్థలన్నీ క్విక్‌ కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టడంతో ఈ రంగంలో పెను సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బ్లింకిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

క్విక్‌ కామర్స్ రంగంలో తన సేవలను మరింత విస్తరించే క్రమంలో బ్లింకిట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటి వరకు స్మార్ట్‌ ఫోన్‌లను 10 నిమిషాల్లో అందించిన ఈ సంస్థ ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ టీవీల డెలివరీని ప్రారంభించబోతోంది. షావోమీ కంపెనీకి చెందిన టీవీలను తొలుత హోం డెలివరీ చేయనున్నారు. తొలుత ఈ సేవలను ఢిల్లీ, ముంబయి, బెంగళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాల్లో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత దేశంలోని పలు ప్రధాన నగరాలకు విస్తరించాలనే ప్లాన్‌లో ఉన్నారు.

షావోమీ బ్రాండ్‌కు చెందిన 43 ఇంచెస్, 32 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీలను హోం డెలివరీ చేయనున్నట్లు బ్లింకిట్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ అల్బిందర్‌ దిండ్సా బుధవారం తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని బ్రాండ్లకు చెందిన టీవీలను ఈ సేవ కిందికి తీసుకొస్తామన్నారు. ఇక టీవీ ఇన్‌స్టాలేషన్‌ ప్రాసెస్‌ షావోమీ చూసుకుంటుంది. అయితే త్వరలోనే ఈ సేవలను ఇతర స్మార్ట్‌ టీవీ కంపెనీలకు కూడా విస్తరిస్తామని అల్బిందర్‌ తెలిపారు.

ఇదిలా ఉంటే బ్లింకింట్‌ ఇప్పటికే ఢిల్లీ ఎన్‌సీఆర్‌తో పాటు ముంబయి, బెంగళూరులో ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఫోన్‌లను డెలివరీ చేయడానికి నోకియా, షావోమీతో ఒప్పందం చేసుకుంది. బ్లింకిట్‌ యాప్‌లో ఆర్డర్‌ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను డెలివరీ చేసే అవకాశాన్ని కల్పించారు. అయితే కేవలం స్మార్ట్‌ ఫోన్‌లకు మాత్రమే పరిమితం కాకుండా ల్యాప్‌టాప్‌లు, మానిటర్లు, ప్రింటర్ల వంటి గ్యాడ్జెట్స్‌ను కూడా 10 నిమిషాల్లోనే అందిస్తున్నారు.

అమెజాన్‌ కూడా..

ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సైతం క్విక్‌ కామర్స్‌ రంగంలోకి అడుగుపెట్టింది. అమెజాన్‌ నౌ పేరుతో తీసుకొచ్చిన ఈ సేవలను బెంగళూరులోని ఎంపిక చేసిక కొన్ని ప్రదేశాల్లో ప్రారంభించింది. రానున్న రోజుల్లో ఇతర నగరాల్లోనూ ఈ సేవలను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 2 వేల వరకు ప్రొడక్ట్స్‌ను కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేస్తున్నారు. కూరగాయలు, కిరణా వస్తువులు వంటి నిత్యావసరాలతో పాటు బ్యూటీ, గృహోపకరణాలను డెలివరీ చేయనున్నారు.