అరుంధతి సినిమాలో సమాధిలో కుళ్ళిపోయి అమ్మో బొమ్మాలి అంటూ తిరిగి వచ్చి ప్రేక్షకులందరికీ తన నటనతో ఆశ్చర్యపరిచిన నటుడు సోనుసూద్. కేవలం తన నటనతో మాత్రమే కాదు తన సేవా కార్యక్రమాలతో కూడా సోను సూద్ ఎప్పుడు వార్తల్లో ముఖ్యమైన వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు. తనకు వచ్చిన సంపాదనలో పెద్ద మొత్తంలో సేవా కార్యక్రమాలు చేస్తూ సోను ఎంతో పేరు తెచ్చుకున్నారు.
కరోనా సమయంలో వేలాది మందికి సోను తన సేవలను అందించారు. అలాంటి సోను ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా చక్కగా రాణిస్తున్నాడు. ఇటీవల సోను తాను నివాసం ఉంటున్న ఒక ఫ్లాట్ ను 8.10 కోట్ల రూపాయలకు విక్రయించాడు. ఈ లావాదేవీ మొత్తం ఆగస్టు 2025 లో పూర్తయినట్లు సోర్సెస్ చెబుతున్నాయి. అయితే ముంబైలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ స్థానికంగా మహాలక్ష్మి లోఖండ్ ఏరియాలో ఉన్నట్లు చెబుతున్నారు. మినర్వా ప్రాజెక్టుగా పేరు పొందిన ఈ అపార్ట్మెంట్ స్థానికంగా అత్యంత విలాసవంతమైన రెసిడెన్షియల్ టవర్స్ లో ఒకటిగా చెబుతుంటారు.
ఇక సోను విక్రయించిన ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం కార్పెట్ ఏరియా 1,247 చదరపు అడుగులు , బిల్ట్ అప్ ఏరియా 1,497 చదరపు అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు కార్ల పార్కింగ్ స్పేస్ తో పాటు ఇతర ఎమినిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే సోనూ ఈ ఫ్లాట్ ను 2012లో 5.16 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే 13 సంవత్సరాల్లో ఆయనకు రూ. 2.94 కోట్ల లాభం వచ్చింది. నిజానికి ఇది చాలా మంచి డీల్ అని చాలామంది చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ముంబైలో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని తాకుతూ రికార్డులను బద్దలు కొడుతున్నాయి. సోను విక్రయించిన ఈ ప్లాట్ ధర అంత ఉండటానికి కారణం ముఖ్యంగా లొకేషన్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఈ ప్రాంతాన్ని మహాలక్ష్మి, దక్షిణ ముంబయిలో ముఖ్యమైన వాణిజ్య ప్రాంతంగా చెబుతుంటారు. ఈ ప్రాంతం లోయర్ పరేల్, వర్లీ, నారిమన్ పాయింట్ అనే ప్రైమ్ లోకేషన్లకు సమీపములో ఉంది. ఇక్కడి సీవ్యూ, రేస్‌కోర్స్, విలాసవంతమైన హై-రైజ్ అపార్ట్మెంట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పలువురు వ్యాపారవేత్తలు, సెలబ్రిటీ పీపుల్ ఇక్కడ స్థిరపడతారు.
ఇదిలా ఉంటే సోను సూద్ 1999లో తన కెరీర్ ప్రారంభించారు. తెలుగు, తమిళం, హిందీ, పంజాబీ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో హీరోగాను విలన్ గాను నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అరుంధతి, సూపర్, అతడు, అశోక్, ఏక్ నిరంజన్ వంటి చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. బాలీవుడ్ లో సైతం పలు విజయవంతమైన సినిమాల్లో అటు హీరోగాను, విలన్ పాత్రల్లో సైతం మెప్పించి సోను తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.
































