క్షమించండి.. నెలలో తిరిగిస్తా …ఉత్తరం రాసి చోరీకి పాల్పడ్డ దొంగ

www.mannamweb.com


ఎక్కడైనా దొంగతనం జరిగి ఏవైనా వస్తువులు పోతే ఆ చోరులు పోలీసులకు పట్టుబడితే కానీ మళ్లీ తిరిగొచ్చే అవకాశం లేదు. తూత్తుక్కుడి జిల్లాలో ఓ దొంగ నగలు, నగదు తీసుకెళ్లిపోయాడు.

ఎక్కడైనా దొంగతనం జరిగి ఏవైనా వస్తువులు పోతే ఆ చోరులు పోలీసులకు పట్టుబడితే కానీ మళ్లీ తిరిగొచ్చే అవకాశం లేదు. తూత్తుక్కుడి జిల్లాలో ఓ దొంగ నగలు, నగదు తీసుకెళ్లిపోయాడు. పోతుపోతూ లేఖ రాసి పెట్టాడు. మళ్లీ నెలరోజుల్లో తిరిగిచ్చేస్తానని అందులో రాయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

పోలీసుల వివరాల మేరకు… జిల్లాలోని తిరుచ్చెందూర్‌ వద్ద మేఘ్నాపురానికి చెందిన చిత్తిరై సెల్విన్‌ విశ్రాంత ఉపాధ్యాయుడు. కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహమై వేరే ఊళ్లలో ఉంటున్నారు. ఆయన గతనెల 17న భార్యతో కలిసి చెన్నై వెళ్లాడు. అప్పుడు వారి ఇంటిని సెల్వి అనే మహిళ చూసుకునేది. ఆమె ఈనెల 1న ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లగా తాళాలు పగులగొట్టి కనిపించాయి. విషయం చిత్తిరై సెల్వన్‌కి తెలియజేయడంతో ఆయన వచ్చి చూసేసరికి బీరువాలోని రూ.60 వేల నగదు, ఒకటిన్నర సవర్ల బంగారు కమ్మలు, వెండి గొలుసులు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించగా దొంగ రాసిన ఉత్తరం కనిపించింది. అందులో.. ‘నన్ను క్షమించండి. నేను నెలలో తిరిగిస్తాను. ఇంట్లో ఆరోగ్యం బాగాలేదు, అందుకే దొంగతనం చేశా’నని రాసి ఉంది. పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. అందులో రాసి ఉన్న ప్రకారం తిరిగిస్తాడా లేదా అన్నది తెలియాలంటే నెలరోజులు నిరీక్షించాల్సిందే. ఈ లేఖ స్థానికంగా కలకలం సృష్టించింది.