ఏప్రిల్ 15, 2024 ఐపీఎల్ చరిత్రలోనే కాదు.. వరల్డ్ క్రికెట్ హిస్టరీలో గుర్తుండిపోయే రోజు. రికార్డులు బద్దలు కొడుతు సాగిన సునామీ లాంటి మ్యాచ్ లో ప్రేక్షకులు ఫోర్లు, సిక్సర్లతో తడిచిముద్దైపోయారు. పట్టుమని నెల రోజులు కాకముందే తన రికార్డ్ ను తానే బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ ను క్రికెట్ చరిత్రలో లిఖించింది సన్ రైజర్స్ హైదరాబాద్. తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో 287 పరుగులు చేసి అందరిని షాక్ కు గురిచేసింది. అయితే తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా బెంగళూరు బ్యాటర్లు చెలరేగిపోయారు. దినేశ్ కార్తిక్ మెరుపు ఇన్నింగ్స్ తో గెలుపు వాకిట్లోకి వెళ్లింది, కానీ కొద్దిలో ఓటమి చెందింది. అయితేనే వరల్డ్ రికార్డును తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకుంది ఆర్సీబీ.
సన్ రైజర్స్ హైదరాబాద్.. ఈ ఐపీఎల్ సీజన్ లో రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నట్లు ఉంది. 20 రోజుల ముందే ఐపీఎల్ అత్యధిక స్కోర్ రికార్డును బద్దలు కొట్టిన సన్ రైజర్స్.. తాజాగా తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ముంబై పై 277 పరుగులు చేసిన హైదరాబాద్ టీమ్.. తాజాగా ఆర్సీబీ బౌలర్లను ఊచకోత కోస్తూ 287 రన్స్ పిండుకుంది. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ ట్రావిస్ హెడ్ థండర్ శతకం సాధిస్తే.. క్లాసెన్, సమద్, అభిషేక్ శర్మ తమ పని తాము కానించారు. ఇక 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ సైతం దుమ్మురేపింది.
తొలుత డుప్లెసిస్(62), కోహ్లీ(42) అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తే.. ఆ తర్వాత ఫినిషర్ దినేశ్ కార్తిక్ సంచలన ఇన్నింగ్స్ తో అబ్బురపరిచాడు. కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్సులతో 83 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 262 రన్స్ చేసి విజయానికి 25 పరుగుల దూరంలో ఆగిపోయింది. అయితే ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఇప్పటి వరకు దాదాపు 13 వేల టీ20 మ్యాచ్ లు జరగ్గా.. అందులో ఛేజింగ్ లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది. ఇది టీ20 చరిత్రలోనే అత్యధిక ఛేజింగ్ స్కోర్. ఆర్సీబీ ఓడినా వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.