ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న శ్రీతేజను ఆదివారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
బాలుడి నాన్నతో మాట్లాడినట్లు తెలిసింది. ఆ తర్వాత మహిళా కమిషన్ ఛైర్మన్ నేరెళ్ల శారద ఆస్పత్రికి వచ్చి శ్రీతేజ్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
కాగా డిసెంబర్ 4న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప2 సినిమా ప్రీమియర్ షో వేశారు. ఈ మూవీ చూసేందుకు దిల్ సుఖ్ నగర్ కు చెందిన భాస్కర్, రేవతి, శ్రీతేజ, సాన్వి వచ్చారు. అదే సమయంలో సినిమా చూడడానికి హీరో అల్లు అర్జున్ వచ్చారు. అయితే ఆయన థియేటర్ లోకి వెళ్లి సినిమా చూడకుండా ఫ్యాన్స్ కు అభివాదం తెలిపారు. దీంతో బన్నీ చూడడానికి ఒక్కసారిగా ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది.
ఈ క్రమంలోనే రేవతి, శ్రీతేజ కిందపడిపోయారు. గమనించిన పోలీసులు వెంటనే వారికి సీపీఆర్ చేశారు. శ్రీతేజ స్పృహాలోకి వచ్చాడు. కానీ రేవతి రాలేదు. దీంతో ఇద్దరిని విద్యనగర్ లోని దుర్గాబాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేవతి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి శ్రీతేజ ఆరోగ్యం క్రిటికల్ గానే ఉంది. ఈ తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు.
ముందు థియేటర్ మేనేజర్లను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు పెట్టారు. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ను బీఆర్ఎస్, బీజేపీ ఖండించాయి. కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు. విషయం ఏమిటంటే.. ఘటన జరిగిన తర్వాత బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ అల్లు అర్జున్ ను తప్పుబట్టారు. కానీ కేటీఆర్ అర్జున్ అరెస్ట్ ను ఖండించారు. ఒకే పార్టీలో భిన్న అభిప్రాయాలు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ కేసులో అల్లు అర్జున్ కు హైకోర్టు బెయిల్ ఇచ్చింది.