డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసిన స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక సంఘాలు

www.mannamweb.com


డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ను కలిశారు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ప్రధానంగా చర్చించారు. స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలంటూ… 1333 రోజులుగా దీక్ష చేస్తున్నట్లు పవన్‌కు తెలిపారు కార్మిక సంఘాల నేతలు.

కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిందిగా కోరారు. పవన్ కేంద్రంతో మాట్లాడినప్పటి నుంచే ప్రైవేటీకరణ అంశం వేగం తగ్గిందన్నారు. చంద్రబాబు, పవన్ కారణంగానే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని సీఎం చంద్రబాబు స్పష్టం చెప్పారని కార్మిక సంఘం నేతలు గుర్తు చేశారు. దీనిపై పవన్ కల్యాణ్‌కు తాము ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చామన్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగుతుందని.. ఆ క్రెడిట్ కూడా పవన్ కల్యాణ్‌కే దక్కుతుందని తెలిపారు.

గత ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ను తొలగించి అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టే ఆలోచన చేసిందని ఆరోపించారు. దాని వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల్లో ఇంకా కొందరికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని.. వారికి కూడా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. మరోవైపు ఇటు స్టీల్‌ ప్లాంట్ విలీనంపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్కు పరిరక్షణ కమిటి ఆధ్వర్యంలో అగనంపూడి నుంచి గాజువాక వరకు మానవహారం నిర్వహించారు కార్మికులు.