అయితే జాగ్రత్త! ఆ ఆకర్షణీయమైన ప్యాకెట్ల వెనుక ప్రాణాంతకమైన ఊబకాయం, దీర్ఘకాలిక వ్యాధులు పొంచి ఉన్నాయి. దేశంలో యువత మరియు పిల్లల ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంపై భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2024-25 (Economic Survey 2024-25) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు (UPF) – అంటే మనం పిలిచే ‘జంక్ ఫుడ్'(Junk Food)పై యుద్ధం ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది.
దేశంలో యువత, చిన్నారుల ఆరోగ్యాన్ని హరిస్తున్న ‘అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్’ (UPF)పై కేంద్ర ప్రభుత్వం గట్టి నిఘా ఉంచబోతోంది. అధిక కొవ్వు, చక్కెర, ఉప్పుతో నిండిన జంక్ ఫుడ్స్ వినియోగంపై ఆర్థిక సర్వే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ మాధ్యమాల్లో వస్తున్న ఆకర్షణీయమైన ఆహార ప్రకటనలే మన అనారోగ్యానికి మూలమని గుర్తిస్తూ, వాటిపై కఠినమైన ఆంక్షలు విధించాలని సూచించింది. ముఖ్యంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు టీవీ, సోషల్ మీడియాలో ఇలాంటి ఆహార పదార్థాల మార్కెటింగ్‌ను పూర్తిగా నిషేధించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేసింది.
40 రెట్లు పెరిగిన అమ్మకాలు
రెట్టింపైన ఊబకాయం భారతదేశం ప్రస్తుతం జంక్ ఫుడ్ విక్రయాలకు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా మారింది. 2006లో కేవలం 0.9 బిలియన్ డాలర్లుగా ఉన్న వీటి రిటైల్ అమ్మకాలు, 2019 నాటికి 38 బిలియన్ డాలర్లకు (దాదాపు 40 రెట్లు) చేరడం ఆందోళనకరం. 2009 నుండి 2023 మధ్య కాలంలో భారతీయుల ఆహారపు అలవాట్లలో జంక్ ఫుడ్ వినియోగం 150 శాతం పెరిగింది. ఇదే కాలంలో దేశీయ పురుషులు మరియు మహిళల్లో ఊబకాయం సమస్య దాదాపు రెట్టింపు అయ్యిందని, ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తోందని సర్వే హెచ్చరించింది.
వినియోగదారులు తప్పుదోవ పడుతున్నారు
మోసపూరిత ప్రకటనలకు అడ్డుకట్ట ప్రస్తుతం కంపెనీలు తమ ఉత్పత్తులను ‘హెల్తీ’, ‘ఎనర్జీ’, ‘న్యూట్రిషన్’ వంటి అస్పష్టమైన పదాలతో మార్కెట్ చేస్తున్నాయని, దీనివల్ల వినియోగదారులు తప్పుదోవ పడుతున్నారని ఆర్థిక సర్వే ఎత్తిచూపింది. ప్యాకెట్లపై పోషకాహార విలువలను స్పష్టంగా పేర్కొంటూ ‘హెచ్చరిక లేబులింగ్’ ఉండాలని సూచించింది. చిలీ, నార్వే, బ్రిటన్ వంటి దేశాల్లో ఇప్పటికే ఇలాంటి ఆంక్షలు అమలులో ఉన్నాయని, బ్రిటన్ ఇటీవల రాత్రి 9 గంటల లోపు జంక్ ఫుడ్ ప్రకటనలను నిషేధించిందని గుర్తు చేసింది. అదే తరహాలో మన దేశంలో కూడా పాఠశాలలు, కళాశాలల కార్యక్రమాలకు ఈ కంపెనీలు స్పాన్సర్‌షిప్‌లు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని కోరింది.
సమన్వయ వ్యూహమే పరిష్కారం కేవలం ప్రజల ఆహారపు అలవాట్లు మారాలని కోరడం వల్ల ప్రయోజనం ఉండదని, ప్రభుత్వం నుంచి బలమైన నియంత్రణ వ్యవస్థ అవసరమని సర్వే అభిప్రాయపడింది. వాణిజ్య ఒప్పందాలు ప్రజారోగ్యాన్ని దెబ్బతీయకుండా చూడాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ నివేదిక సిఫార్సు చేసింది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల లభ్యతను పెంచుతూనే, అనారోగ్యకరమైన ఆహార ఉత్పత్తిని తగ్గించేలా బహుముఖ వ్యూహాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది.

































