మేం గెలిచాక నువ్వెక్కడ దాక్కున్నా లాక్కొస్తా.

పుల్లారావు.. గుర్తు పెట్టుకో.. మళ్లీ అధికారంలోకి వస్తాం.. నువ్వెక్కడికి పారిపోయి దాక్కున్నా లాక్కొచ్చి వడ్డీతో సహా చెల్లిస్తా..


అని మాజీ మంత్రి విడుదల రజిని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని తన నివాసంలో శనివారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.. కట్టుకథ అల్లి తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టించారని, తనతోపాటు తన కుటుంబంపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు.

80 ఏళ్ల తన మామ, విదేశాల్లో ఉంటున్న తన మరిదిపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. తనది పురుషోత్తమపట్నమేనని, తనతోపాటు పుల్లారావుకూ కుటుంబం ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. తన కుటుంబం జోలికి, కార్యకర్తలు, నాయకుల జోలికి వచ్చినా సంహించే ప్రసక్తే లేదన్నారు. అవినీతిలో ఘనాపాటి అయిన పుల్లారావు 2019లో ఒక ఘటన జరిగిందంటూ తనపై అట్రాసిటీ కేసు నమోదు చేయించారని, పైగా హైకోర్టు నమోదు చేయమందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు పుల్లారావు చేసిన అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలపై తాను దృష్టి పెట్టి ఉంటే ఆయన ఎక్కడుండే వాడో నని అన్నారు. తమ పాలనలో అభివృద్ధిపై దృష్టి పెడితే ఇప్పుడు అరాచకంపై దృష్టి పెట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చిలకలూరిపేటలో పేకాట, అక్రమ మైనింగ్‌, సెటిల్మెంట్లు, అన్యాయాలు, అక్రమాలకు కేరాఫ్‌గా మారిందన్నారు.