కాలం వేగంగా పరిగెడుతోంది. ఇప్పటికే సమాజంలో చాలా మార్పు వచ్చింది. సైన్స్, సాంకేతికరంగాల్లో దేశం దూసుకుపోతోంది.
అంతా కంప్యూటర్ యుగమైంది. ప్రాంతాలు, కులాలకు సంబంధం లేకుండా అంతా ఉన్నత స్థానాలను అందుకుంటున్నారు. అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తున్నాం.. ఇలా సమాజం ఎంతో మందుకు వెళ్తుంటూ.. ఇంకా కొన్ని చోట్ల కులం కట్టుబాట్లు.. వివక్షలు తగ్గడం లేదు.
తాజాగా పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో చోటుచేసుకున్న ఒక షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యండపల్లి హైస్కూల్‌లో దళిత విద్యార్థులపై జాతి వివక్ష కొనసాగుతుందంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు తమ పిల్లలను అవహేళన చేస్తూ, కులం పేరుతో దూషిస్తున్నారని వారు ఆరోపించారు.
వివరాల ప్రకారం.. తరగతి గదుల్లోనే కొంతమంది ఉపాధ్యాయులు బహిరంగంగానే మీది వెధవ జాతి, ఎస్సీలు ఏమైనా పుడింగులు అనుకున్నారా..? అని ఉపాధ్యాయులు తిడుతున్నారని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆడపిల్లలను చెడ్డపేర్లతో పిలుస్తూ అవమానిస్తున్నారని హెచ్‌ఎంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు, పాఠశాల ఎదుట పెద్ద సంఖ్యలో చేరి రోడ్డుపై బైఠాయించారు. ఉపాధ్యాయులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల నిర్వహణపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలో పిల్లలకు భద్రత, సమానత్వం ఉండాల్సిన సమయంలో ఉపాధ్యాయుల నుంచే అవమానాలు ఎదుర్కోవడం దారుణమని పలువురు అభిప్రాయపడ్డారు.



































