Success Story: చాకులాంటి హైదరాబాద్ కుర్రోడు.. స్టాక్ మార్కెట్లో రూ.100 కోట్లు కొట్టాడు..

www.mannamweb.com


Sankarsh Chanda: స్టాక్ మార్కెట్లు అనగానే చాలా మందికి గుర్తుకొచ్చే అంశం అందులో వచ్చే నష్టాలు. అయితే 23 ఏళ్ల హైదరాబాదీ కుర్రోడు మాత్రం కోట్లు సంపాదించాడు.
అందుకే అతడిని చాలా మంది దివంగత రాకేష్ జున్‌జున్‌వాలా, వారెన్ బఫెట్ లతో పోల్చుతున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సంకర్ష్ చందా గురించే. ఇతడు కేవలం రూ.2000 నుంచి రూ.100 కోట్ల వరకు ఆస్తిని సంపాదించాడు. చదవటాన్ని ఎక్కువగా ఇష్టపడే చందా అభిరుచి అతడిని బిలియనీర్ కావాలనే కోరికవైపు నడిపించింది. అలా 14 ఏళ్ల వయస్సులో బెంజమిన్ గ్రాహం రాసిన “వాల్యూ ఇన్వెస్టింగ్” అనే వ్యాసం మెుదటిసారి చదివాడు. ఇందులో బెంజమిన్ గ్రాహం మంచి రాబడిని పొందడం కోసం వాటి అంతర్గత విలువ కంటే తక్కువ విలువైన స్టాక్‌లను ఎంచుకోవడం గురించి వివరించారు. అయితే దీనిని స్టాక్ మార్కెట్లలో పరీక్షించాలని సంకర్ష్ నిర్ణయించుకున్నాడు.

అయితే 14 ఏళ్ల వయస్సులో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన డబ్బు, డీమ్యాట్ ఖాతా అతనికి లేవు. ఆ సమయంలో తన సోదరి డీమ్యాట్ ఖాతాని వినియోగించాడు. తనకు వచ్చిన స్కాలర్ షిప్ డబ్బును మెుదట్లో పెట్టుబడిగా పెట్టడం ప్రారంభించాడు. తన మెుదటి పెట్టుబడిని కేవలం రూ.2000తో ప్రారంభించాడు. పెద్ద స్టాక్స్ కాకుడా చౌకగా ఉన్న మంచి షేర్లను ఎంచుకోవటం ఈ కుర్రోడి ప్రత్యేకత. ఈ క్రమంలో కంపెనీల బ్యాలెన్స్ షీట్లు, మార్కెట్ ట్రెండ్స్ పరిశీలించి పరిశోధనలు చేయటం లాభాలను తెచ్చిపెట్టింది.

క్రమంగా బావ సాయంతో చైనా, అమెరికా కంపెనీల్లో కూడా పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. అలా 17 ఏళ్ల వయస్సులోనే ‘ఆర్థిక నిర్వాణ’పై మెుదటి పుస్తకాన్ని ప్రచురించాడు. సంకర్ష్ ఈ పుస్తకంలో తన స్వంత అనుభవం నుంచి అభివృద్ధి చెందిన సాంప్రదాయ, ఆధునిక పెట్టుబడి పద్ధతులు, పెట్టుబడి అవగాహనను విజయవంతంగా మిళితం చేశాడు. ఈ క్రమంలోనే సంకర్ష్ 18వ ఏట సావర్ట్ అనే ఫిన్‌టెక్ స్టార్టప్‌ ప్రారంభించాడు. ఇది ప్రజలు వారి అవసరాల ఆధారంగా మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించే వేదిక. ఇది పెట్టుబడిదారుల నుంచి 1-2 శాతం వరకు కమీషన్లను వసూలు చేస్తోంది. ప్రస్తుతం సావర్ట్ విలువ రూ.100 కోట్లకు చేరుకుంది.