ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, ఆపై హత్యతో దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పనివేళల్లో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జనరల్ ఆసుపత్రిలో అర్దరాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సూపరింటెండెంట్ ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
రోగులకు సంబంధం లేని వ్యక్తులు ఆసుపత్రి ప్రాంగణంలో అనేకమంది ఉన్నట్లు గుర్తించారు. వీరు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు కనుగొన్నారు. అసలు రోగులతో సంబంధం లేని వ్యక్తులు హాస్పిటల్‌లోకి ఎందుకు వచ్చారో ఆరా తీయాలంటూ సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. జీజీహెచ్ పక్కనే గుంటూరు రైల్వే స్టేషన్ ఉండటంతో ఆక్కడ సంచరించే బిచ్చగాళ్లు, అనాథలు కూడా రాత్రి వేళల్లో మద్యం సేవించి జీజీహెచ్ ప్రాంగణంలోకి వస్తున్నట్లు తెలిసింది. దీంతో సూపరింటెండెంట్ సెక్యూరిటీ సిబ్బందికి తక్షణమే వారందరిని బటయకు పంపాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
రోగులకు సంబంధించి ఒకరిద్దరూ మించి సహాయకులు ఉన్నట్లుగా సూపరింటెండెంట్ తనిఖీల్లో బయటపడింది. దీంతో వారందరికీ అవగాహన కల్పించి అక్కడ నుండి పంపించి వేశారు. రోగి సహాయకులు ఎక్కువ మంది ఉండటంతో వైద్యుల సేవలకు అంతరాయం కలుగుతున్న విషయాన్ని వారికి తెలిసేలా చెప్పాలంటూ సూపరింటెండెంట్ కిరణ్ సిబ్బందికి చెప్పారు. వైద్యులకు తగిన విధంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉందని దీంతో రాత్రి వేళలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ క్రమంలో మందుబాబులకు జీజీహెచ్ అనుమతి లేదంటూ తేల్చి చెప్పారు. మద్యం సేవించినట్లు అనుమానం వెంటనే వెంటనే వారిని ఆసుపత్రి నుండి బయటకు పంపించేయాలంటూ సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ఇక ముందు పగటి సమయాల్లో కూడా మద్యం సేవించి వచ్చే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుండి పంపించి వేయాలన్నారు.
మొత్తం మీద రాత్రి సమయాల్లో విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు పూర్తి సహకారం అందిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ కూడా తెలిపారు. దీంతో ఇక ముందు జీజీహెచ్‌లో మందుబాబులకు నో ఎంట్రీ అంటూ సిబ్బంది చెబుతున్నారు.