Suicide: మరణం తర్వాత ఏం జరుగుతుంది..? తెలుసుకునేందుకు బాలిక ఆత్మహత్య

www.mannamweb.com


మనిషి మరణించిన తర్వాత వారి ఆత్మ స్వర్గం లేదా నరకానికి వెళుతుందని వింటుంటాం. అయినప్పటికీ ఈ అంశంలో నిజానిజాలు ఎవరికీ తెలియవు. అయితే.. చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఓ బాలిక ఏకంగా తన ప్రాణాలే తీసుకుంది. తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్రలో (Maharashtra) చోటు చేసుకుంది.

నాగ్‌పూర్‌కు (Nagpur) చెందిన ఓ బాలిక ఇంటర్మీడియట్‌ చదువుతోంది. ఆమె తన ఇంట్లోని గదిలో ఆత్మహత్య చేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న కుమార్తెను చూసిన తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అయితే.. ఆమె తన ఫోన్‌లో మరణం తర్వాత ఏం జరుగుతుంది..?, విదేశీ సంస్కృతుల గురించి ఎక్కువగా గూగుల్‌ సెర్చ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఎంతో కాలంగా ఆత్మహత్య చేసుకునేందుకు బాలిక ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆన్‌లైన్ గేమింగ్‌కి కూడా బానిసగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్‌ నుంచి ఓ కత్తిని ఆర్డర్‌ చేసుకున్న బాలిక తొలుత తన చేతిని గాయపరుచుకుందని.. అనంతరం మెడను కోసుకుని చనిపోయి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.