బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్‌లో భాగంగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ లాంఛ్ చేసింది.
ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తు అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకంలో పెట్టుబడులపై కేంద్రం ఏటా వడ్డీ రేటు అందిస్తూ.. నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఒకేసారి చేతికి పెద్ద మొత్తం అందిస్తుంది. ఇంకా.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ పథకం వడ్డీ రేట్లను కూడా కేంద్రం.. ప్రతి 3 నెలలకు ఓసారి సవరిస్తుంటుంది. వడ్డీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం లేదా స్థిరంగా ఉంచడం చేస్తుంది. ప్రస్తుతం సుకన్య సమృద్ధి పథకంలో వడ్డీ రేటు వార్షిక ప్రాతిపదికన 8.20 శాతంగా ఉంది. ఈ పథకం గురించి చూద్దాం.
సుకన్య సమృద్ధి పథకం కేవలం ఆడపిల్లల కోసం మాత్రమే ఉద్దేశించింది. ఇందులో ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. 10 సంవత్సరాల వయసులోపు పాపను ఇందులో చేరొచ్చు. మైనర్ పేరిట గార్డియెన్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీస్ లేదా గుర్తింపు పొందిన బ్యాంకుల్లోకి వెళ్లి ఈ పథకంలో చేరొచ్చు. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లల పేరిట అకౌంట్ తెరవొచ్చు. అదే ట్విన్స్ లేదా ట్రిప్లెట్స్ జన్మించిన సమయంలో మాత్రం రెండు కంటే ఎక్కువ అకౌంట్లు తెరిచేందుకు వీలుంటుంది.
ఇందులో ఏడాదికి కనీసం రూ. 250 నుంచి రూ. 500, రూ. 1000, రూ. 10 వేలు, రూ. 20 వేలు, 50 వేలు ఇలా గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఇక దీనిని ఒకేసారి కట్టొచ్చు లేదా ఇన్‌స్టాల్‌మెంట్లలోనూ చెల్లించొచ్చు. అకౌంట్ తెరిచినప్పటి నుంచి వరుసగా 15 సంవత్సరాలు ఈ అకౌంట్లో డబ్బులు కడుతుండాలి. అకౌంట్ తెరిచిన 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది. అప్పుడు పూర్తి డబ్బులు తీసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన పథకం వివరాలు..
పాపకు 18 ఏళ్లు వచ్చాక లేదా పదో తరగతి పాసైన సమయంలో సుకన్య సమృద్ధి అకౌంట్ నుంచి ఒకేసారి 50 శాతం వరకు డబ్బులు తీసుకోవచ్చు. ఇక్కడ విత్‌డ్రా కూడా ఒకేసారి లేదా విడతల్లో తీసుకోవచ్చు. అకౌంట్ హోల్డర్ చనిపోయిన పక్షంలో లేదా గార్డియెన్ మరణం లేదా ప్రాణాంతక వ్యాధుల బారిన పడిన సమయాల్లో మెచ్యూరిటీకి ముందే అకౌంట్ నుంచి వైదొలగవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల తర్వాత ఇలా చేయొచ్చు. ఒకవేళ సుకన్య సమృద్ధి అకౌంట్ ఉన్న ఆడపిల్లకు 18 ఏళ్లు దాటాక పెళ్లి సమయంలో కూడా అకౌంట్ క్లోజ్ చేయొచ్చు. మొత్తం డబ్బులు వస్తాయి. లేని పక్షంలో మాత్రం అకౌంట్ తెరిచిన తర్వాత.. 21 ఏళ్లకే డబ్బులు చేతికి అందుతాయి.
సుకన్య సమృద్ధి యోజన పెట్టుబడి..
పాప చిన్న వయసులోనే అంటే.. పుట్టినప్పుడే ఏడాది సమయంలో ఇందులో చేరితే పెళ్లి వయసుకల్లా పెద్ద మొత్తంలో డబ్బు పొందొచ్చు. ఇప్పుడు పాపకు ఏడాది వయసులో (2024లో).. మనం గరిష్ట పెట్టుబడి అయిన రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేస్తే.. 8.20 శాతం వడ్డీ రేటు చొప్పున మెచ్యూరిటీకి (2045లో) చేతికి కచ్చితంగా (ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం) రూ. 69.27 లక్షలు వస్తాయి. ఇక్కడ మీ పెట్టుబడి 15 ఏళ్లకు (రూ. 1,50,000×15) = రూ. 22.50 లక్షలు కాగా.. వడ్డీతోనే రూ. 46 లక్షలకుపైగా అందుతుంది. రూ. 1.50 లక్షల్ని ఒకేసారి కాకుండా.. నెలకు రూ. 12,500 చొప్పున కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు.
సుకన్య సమృద్ధి యోజన టాక్స్ బెనిఫిట్స్..
నెలకు రూ. 10 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే.. ఏడాదికి రూ. 1.20 లక్షల పెట్టుబడిపై మెచ్యూరిటీకి చేతికి రూ. 55.42 లక్షలు వస్తాయి. అదే నెలకు రూ. 5 వేల చొప్పున చూస్తే.. ఏటా రూ. 60 వేలతో మెచ్యూరిటీకి చేతికి రూ. 27 లక్షలపైనే అందుతుంది. ఇంకా.. ఇందులో పాత పన్ను విధానం ప్రకారం.. పెట్టుబడులపై ఏటా రూ. 1.50 లక్షల వరకు పన్ను తగ్గించుకోవచ్చు.