చాలామంది శరీరంలో కొవ్వు పేరుకుపోవడం కారణంగా ఊబకాయంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఎన్నో రకాల ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్యులు పదే పదే హెచ్చరిస్తుంటారు.
ముఖ్యంగా కొంతమందిలో ఈ కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా గుండె సమస్యలు కూడా విపరీతంగా వస్తున్నాయి. అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా కొంతమందిలో మధుమేహం వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. కొలెస్ట్రాల్ సమస్యలకు తెల్ల నువ్వులు ఎంతగానో సహాయ పడతాయి. తెల్ల నువ్వులను లడ్డుల్లా తయారు చేసుకునే తింటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా తెల్ల నువ్వుల్లో ఉండే పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు (Polyunsaturated fats) చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు ఒక తెల్ల నువ్వుల లడ్డు తింటే గుండె ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. నువ్వులలోని కాల్షియం ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ రక్త ప్రసరణకు అత్యంత అవసరం. ఇందులోని మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుకు తోడ్పడుతుంది. కాపర్ (రాగి), ఫాస్ఫరస్ మొత్తం ఆరోగ్యానికి దోహదపడతాయి. నువ్వులలోని బి విటమిన్లు శక్తి జీవక్రియకు సహాయపడతాయి.
రోజుకొక తెల్ల నువ్వుల లడ్డు తింటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ లడ్డుల తయారీ కూడా చాలా సులువు.. ఈ లడ్డూ తయారీ కోసం వేయించిన నువ్వులు, బెల్లం, నెయ్యి, మంచి సువాసన కోసం యాలకుల పొడి కలిపి గుండ్రని ఆకారంలో తయారు చేస్తారు. ఇవి మంచి రుచితో పాటు, శరీరానికి శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఇవి చాలా మంచివి.































