ఖగోళ అద్భుతాలను వీక్షించడానికి ఆసక్తి చూపే వారికి గుడ్ న్యూస్! త్వరలో ఓ అద్భుతమైన దృశ్యం కనువిందు చేయనుంది. ఈ వారం అంటే నవంబర్ 5, బుధవారం నాడు ఆకాశంలో చంద్రుడు సాధారణం కంటే పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు.
దీనికి కారణం ‘సూపర్‌మూన్’ అనే అరుదైన ఖగోళ దృగ్విషయం. పౌర్ణమి సమయంలో చంద్రుడు భూమికి తన కక్ష్యలో అత్యంత దగ్గరగా చేరుకోవడమే ఈ అద్భుతానికి కారణం.
సూపర్ మూన్ అంటే ఏమిటి?
చంద్రుడు భూమి చుట్టూ తిరగే కక్ష్య పూర్తిగా వృత్తాకారంలో ఉండదు. ఈ కక్ష్యలో ప్రయాణించేటప్పుడు చంద్రుడు భూమికి దగ్గరగా, దూరంగా వెళ్తూ ఉంటాడు. పౌర్ణమి రోజున చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు ఆ దృశ్యాన్ని ‘సూపర్ మూన్’ అంటారు. నాసా ప్రకారం.. ఈ సూపర్ మూన్ కారణంగా చంద్రుడు సంవత్సరంలో అత్యంత మసకబారిన చంద్రుడితో పోలిస్తే 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా, 14శాతం పెద్దగా కనిపిస్తాడు. నవంబర్ 5న కనిపించనున్న ఈ సూపర్‌మూన్ ఈ ఏడాదిలో ఏర్పడే మూడు సూపర్‌మూన్‌లలో రెండోది, భూమికి అత్యంత చేరువగా ఉండేది. ఈ సమయంలో చంద్రుడు భూమి నుండి దాదాపు 3,57,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు.
సముద్రాలలో పెరగనున్న పోటు
లోవెల్ అబ్జర్వేటరీ ఖగోళ శాస్త్రవేత్త లారెన్స్ వాసర్‌మాన్ ప్రకారం.. సూపర్‌మూన్ సమయంలో చంద్రుడు భూమికి మరింత దగ్గరగా ఉండటం వల్ల సముద్రాలలో జ్వారం (పోటు) కొద్దిగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మార్పు అంతగా కనిపించకపోవచ్చు.
సూపర్‌మూన్‌ను ఎలా చూడాలి?
పరికరాల అవసరం లేదు: ఆకాశం నిర్మలంగా ఉంటే సూపర్‌మూన్‌ను చూడటానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు.
సైజు మార్పు: అయినప్పటికీ చంద్రుని పరిమాణంలో వచ్చే మార్పును మామూలు కళ్లతో గుర్తించడం కొంచెం కష్టమే కావచ్చు. ఇతర రోజుల్లో తీసిన ఫోటోలు లేదా పరిశీలనలతో పోల్చినప్పుడు ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది.
బీవర్ మూన్ ప్రత్యేకత
ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నోలె 1979లో ఈ పెద్దగా, ప్రకాశవంతంగా కనిపించే పౌర్ణమికి మొదటిసారిగా ‘సూపర్‌మూన్’ అనే పదాన్ని ఉపయోగించారు. నవంబర్ నెలలో కనిపించే పౌర్ణమిని ‘బీవర్ మూన్’ అని కూడా అంటారు. ఈ నవంబర్ బీవర్ మూన్ ఈ సంవత్సరం భూమికి అత్యంత దగ్గరగా ఉండే పౌర్ణమి కాబట్టి ఇది చాలా ప్రకాశవంతంగా, పెద్దదిగా కనిపించనుంది.
































