మటన్ అని చెప్పి కుక్క మాంసం సరఫరా.. 4500 కిలోలు పట్టివేత

www.mannamweb.com


Dog Meat: గత కొన్ని రోజులుగా హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు బయట పడుతుండటం సంచలనంగా మారింది. కుళ్లిన మాంసం, పాడైన మాంసం దొరికిన హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నా పరిస్థితి మాత్రం మారడం లేదు. తాజాగా రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన భారీగా కుక్క మాంసం.. పట్టుకోవడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. 90 బాక్సులలో 4500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ భయంకరమైన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.

బెంగళూరులోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజస్థాన్ నుంచి మటన్ పేరుతో బెంగళూరుకు కుక్క మాంసం సరఫరా అవుతోందని హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన రైలులో భారీగా కుక్క మాంసాన్ని పట్టుకున్నారు. 90 డబ్బాల్లో తరలించిన 4500 కిలోల కుక్క మాంసాన్ని హిందూ సంఘాలు అడ్డుకున్నాయి. అయితే నిత్యం బెంగళూరు నగరానికి 14 వేల కిలోల కుక్క మాంసం వస్తున్నట్లు సంబంధిత వర్గాలు ఆరోపించాయి.

వివిధ రాష్ట్రాల నుంచి బెంగళూరు నగరానికి రైళ్ల ద్వారా కుక్క మాంసాన్ని సరఫరా చేస్తున్నారని హిందూ సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ కుక్క మాంసాన్ని మటన్ అనే పేరుతో బెంగళూరు నగరంలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారనే వార్తలు ఇప్పుడు బెంగళూరు వాసులను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే కొన్ని వీడియోల్లో ఆ మాంసంలో పొడవైన తోక ఉండడాన్ని గుర్తించినట్లు ఉంది. ఈ ఘటనతో యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో హిందూ సంఘాల కార్యకర్తలు, మాంసం కొనుగోలుదారులకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో హోటళ్లు, రెస్టారెంట్లలో తినే నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.