Supreme Court: వివాహేతర సంబంధం ద్వారా పిల్లలను కన్నా భర్తే తండ్రి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

ప్రస్తుత కాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోయాయి. అన్యోన్య దాంపత్య జీవితంలో ఈ వివాహేతర సంబంధాలు ఎన్నో అనర్థాలకు దారితీయడంతో పాటు ఎన్నో నేరాలకు తావిస్తున్నాయి.


వాటి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడడమే కాకుండా.. ప్రాణాలు కూడా పోతున్నాయి. మరి వివాహేతర సంబంధాల వల్ల పుట్టిన పిల్లలకు ఎవరు తండ్రిగా ఉండాలి.. ? అనేదానిపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. వివాహం చెల్లుబాటులో ఉండి.. జీవిత భాగస్వాములు ఒకరినొకరు కలుసుకునే అవకాశం ఉంటే.. భార్య ఇతర వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉందని పేర్కొన్నా.. ఆ బిడ్డకు భర్తే చట్టబద్ధమైన తండ్రిగా పరిగణించబడతారని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం.. ఆ పిల్లవాడిని భర్త కుమారుడిగానే గుర్తించాలి.

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం భారతీయ సాక్ష్యాధికార చట్టంలోని సెక్షన్ 112 ప్రకారం వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన పిల్లవాడిని భర్త కుమారుడిగా గుర్తించే అవకాశం ఉందని పేర్కొంది. పిల్లవాడి పితృత్వాన్ని నిర్థారించడానికి డీఎన్ఏ పరీక్షను కోర్టులు ప్రతీసారీ ఆదేశించకూడదని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. డీఎన్ఏ పరీక్ష అనేది వ్యక్తిగత గోప్యతను భంగపరిచే అవకాశం ఉన్నందున కోర్టులు అది అవసరమని నిరూపించే పరిస్థితుల్లో మాత్రమే ఆదేశించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరోపించిన ప్రేమికుడిని అలా డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని బలవంతం చేయడం అతని గోప్యత, గౌరవాన్ని ఉల్లంఘించడమే అవుతుందని కోర్టు పేర్కొంది.

నిజానికి ఈ కేసు కేరళకు చెందిన ఒక జంటకు సంబంధించింది. వివిధ కోర్టుల్లో వాదనల అనంతరం ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరుకుంది. కేసు ఏంటంటే.. కేరళకు చెందిన ఓ మహిళ 1991లో ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆమెకు 2001లో ఒక కుమారుడు జన్మించగా.. కొచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ జన్మ ధ్రువపత్రంలో బాలుడి తండ్రి స్థానంలో ఆమె భర్త పేరును నమోదు చేసింది. ఆ జంట మధ్య విభేదాలు రావడంతో 2003లో విడివిడిగా జీవించడం ప్రారంభించారు.

ఆ తర్వాత ఆమె 2006లో తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. విడాకులు మంజూరైన కొద్ది రోజులకే ఆమె కొచ్చిన్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి.. తన కుమారుడు తన మాజీ భర్తకు జన్మించలేదని.. తన కుమారుడు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల పుట్టాడని.. జన్మధ్రువీకరణ పత్రంలో తండ్రి పేరును మార్చాలని అధికారులను కోరింది. అధికారులు అందుకు అంగీకరించలేదు. దీంతో ఆ మహిళ 2007లో స్థానిక కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో స్థానిక కోర్టు వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తికి, కుమారుడికి డీఎన్ఏ టెస్ట్ చేయాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా.. ఆ మహిళకు చుక్కెదురైంది. పిల్లాడు కడుపులో పడిన సమయంలో భార్యాభర్తలు కలిసి లేరని నిరూపించగలిగితే.. వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తి డీఎన్ఏ పరీక్ష చేసుకోవాలని ఆదేశించగలమని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఆ మహిళ కుమారుడు 2015లో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయని.. ఆ ఖర్చులను తన తల్లి భరించలేకపోతోందని, తనకు చట్టబద్ధమైన తండ్రి నుంచి కూడా సహకారం లేకుండాపోయిందని పిటిషన్ లో ఆ యువకుడు పేర్కొన్నాడు.

తన వైద్యం, చదువు ఖర్చు కోసం మూడో వ్యక్తి నుంచి భృతి ఇప్పించాలని కోర్టును కోరగా.. ఆ యువకుడికి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును మూడో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో అతనికి చుక్కెదురు కాగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు మూడో వ్యక్తికి అనుకూలంగా తీర్పునిస్తూ యువకుడికి షాక్ ఇచ్చింది. పిల్లవాడు కడుపులో పడిన సమయంలో సదరు మహిళ భర్తతో కలిసి ఉంటే.. వివాహేతర సంబంధం వల్ల పిల్లవాడు జన్మించాడని మహిళ భావించినా.. భర్తకు సక్రమ సంతానమే అవుతాడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.