T20 World cup -అమెరికాతో పోరులో చెమటోడ్చిన భారత్‌ గట్టెక్కించిన సూర్య, దూబె

www.mannamweb.com


భారత్‌తో మ్యాచ్‌ అంటే అమెరికా ఏమాత్రం పోటీ ఇస్తుంది అనుకుంటాం.. 111 పరుగుల లక్ష్యమంటే మన వాళ్లకు ఏపాటికి అని తేలిగ్గా తీసుకుంటాం.. కానీ బ్యాటర్లకు పీడకలలా మారిన న్యూయార్క్‌ స్టేడియంలో ఈ పసికూనే రోహిత్‌సేనకు చెమటలు పట్టించింది.

భారత్‌తో మ్యాచ్‌ అంటే అమెరికా ఏమాత్రం పోటీ ఇస్తుంది అనుకుంటాం.. 111 పరుగుల లక్ష్యమంటే మన వాళ్లకు ఏపాటికి అని తేలిగ్గా తీసుకుంటాం.. కానీ బ్యాటర్లకు పీడకలలా మారిన న్యూయార్క్‌ స్టేడియంలో ఈ పసికూనే రోహిత్‌సేనకు చెమటలు పట్టించింది. చిన్న లక్ష్యమే కొండంత స్కోరులా మారింది. ఒక దశలో భారత్‌కు ఓటమి భయాన్నీ కలిగించింది ఆతిథ్య జట్టు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సూర్యకుమార్‌ యాదవ్, శివమ్‌ దూబె విలువైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గట్టెక్కించారు. మొదట అర్ష్‌దీప్‌ సింగ్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శనతో అమెరికాకు చెక్‌ పెట్టాడు.

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుసగా మూడో విజయంతో సూపర్‌-8లో అడుగు పెట్టింది. కానీ పాకిస్థాన్‌ మీదే కాదు.. అమెరికాపైనా రోహిత్‌సేనకు విజయం అంత తేలిగ్గా దక్కలేదు. టోర్నీ ఆరంభం నుంచి బ్యాటర్లకు కఠిన పరీక్షగా మారిన న్యూయార్క్‌ స్టేడియంలో 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌ ఆపసోపాలు పడింది. 3 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లకు కానీ లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. సూర్యకుమార్‌ (50 నాటౌట్‌; 49 బంతుల్లో 2×4, 2×6), శివమ్‌ దూబె (31 నాటౌట్‌; 35 బంతుల్లో 1×4, 1×6) భారత్‌ను గెలిపించారు. అమెరికా బౌలర్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/18) అదరగొట్టాడు. మొదట ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అర్ష్‌దీప్‌ సింగ్‌ (4/9), హార్దిక్‌ పాండ్య (2/14)ల ధాటికి యుఎస్‌ 110 పరుగులకే ఆలౌటైంది. నితీశ్‌ (27), స్టీవెన్‌ టేలర్‌ (24) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు.

షాక్‌ మీద షాక్‌..: న్యూయార్క్‌ పిచ్‌ ఎంత కఠినమైనప్పటికీ.. అమెరికా లాంటి జట్టు మీద 111 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి భారత్‌ అంత కష్టపడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. భారత కుర్రాడే అయిన నేత్రావల్కర్‌.. భారత్‌ను ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. రెండో బంతికే కోహ్లి (0)ని ఔట్‌ చేసిన అతను.. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో రోహిత్‌ (3)నూ పెవిలియన్‌ చేర్చాడు. 10 పరుగులకే ఓపెనర్లు వెనుదిరగడంతో భారత్‌ ఆత్మరక్షణలో పడింది. ఈ స్థితిలో పంత్‌ (18) కొంచెం ధాటిగా ఆడి యుఎస్‌ బౌలర్లపై పైచేయి సాధించాలని చూశాడు. మరో ఎండ్‌లో సూర్య క్రీజులో నిలదొక్కుకోవడానికి తంటాలు పడ్డాడు. 8వ ఓవర్లో 44/2తో భారత్‌ కుదురుకుంటున్న దశలో పంత్‌ను అలీ ఖాన్‌ బౌల్డ్‌ చేశాడు. అలీ ధాటికి స్టంప్‌ విరిగిపోయింది. ఈ స్థితిలో సూర్యకు జత కలిసిన శివమ్‌ దూబె ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. బంతి బ్యాట్‌ మీదికి రాకపోవడంతో తన శైలిలో షాట్లు ఆడడానికి అతను ఇబ్బంది పడ్డాడు. సూర్య షాట్లు కూడా చాలానే గురి తప్పాయి. 13 ఓవర్లకు భారత్‌ 60/3తో నిలవగా.. అప్పుడున్న పరిస్థితుల్లో 7 ఓవర్లలో 51 పరుగులు చేయడం కూడా చాలా కష్టంగానే కనిపించింది. అయితే సూర్య, దూబె సరైన సమయంలో బ్యాట్లు ఝళిపించడంతో లక్ష్యం కరుగుతూ వచ్చింది. అండర్సన్‌ బౌలింగ్‌లో దూబె సిక్సర్‌ బాదితే.. శాండ్లీ బౌలింగ్‌లో సూర్య వరుసగా 6, 4 కొట్టడంతో చివరి 3 ఓవర్లలో 14 పరుగులతో సమీకరణం తేలికైపోయింది. తర్వాత మ్యాచ్‌ ముగియడానికి ఎంతో సమయం పట్టలేదు.

అర్ష్‌దీప్‌ అదరహో..: ఈ ప్రపంచకప్‌లో బ్యాటర్లకు పీడకలగా మారిన న్యూయార్క్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన రోహిత్‌ మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకోగా.. యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ తన పేస్, స్వింగ్‌తో అమెరికా జట్టుకు చుక్కలు చూపించాడు. హార్దిక్‌ పాండ్య సైతం పిచ్‌ను ఉపయోగించుకుని రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అదరగొట్టిన బుమ్రా నుంచే యుఎస్‌ బ్యాటర్లకు ప్రధానంగా ముప్పు పొంచి ఉందనుకుంటే.. అతనీ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్టూ తీయకుండా 25 పరుగులు సమర్పించుకున్నాడు. బుమ్రాను జాగ్రత్తగా ఆడిన యుఎస్‌ బ్యాటర్లు.. అర్ష్‌దీప్‌ ఉచ్చులో చిక్కుకున్నారు. తొలి బంతికే జహంగీర్‌ (0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని పతనానికి శ్రీకారం చుట్టిన ఈ లెఫ్టార్మ్‌ పేసర్‌.. ఓవర్‌ చివరి బంతికి గౌస్‌ (2)ను బుట్టలో వేసుకున్నాడు. పేలవ ఆరంభం తర్వాత కెప్టెన్‌ ఆరోన్‌ జోన్స్‌ (11), నితీశ్‌ (27)లతో కలిసి స్టీవెన్‌ టేలర్‌ జట్టును కాస్త మెరుగైన స్థితికి తీసుకెళ్లాడు. అయితే పరుగుల వేగం మాత్రం పెరగలేదు. 10 ఓవర్లకు కానీ యుఎస్‌ 50కి చేరుకోలేదు. రెండు సిక్సర్లు బాది స్కోరు బోర్డును కదిలించే ప్రయత్నం చేసిన టేలర్‌ను అక్షర్‌ బౌల్డ్‌ చేయగా.. తర్వాత నితీశ్, కోరీ అండర్సన్‌ (15) జోడీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఈ జోడీ ఆడుతున్నపుడు యుఎస్‌ 130 స్కోరు చేసేలా కనిపించింది. కానీ అర్ష్‌దీప్‌ రెండో స్పెల్‌లోనూ అమెరికాను దెబ్బ కొట్టాడు. నితీశ్‌ను పెవిలియన్‌ చేర్చాడు. అండర్సన్‌ వికెట్‌ను హార్దిక్‌ పడగొట్టాడు. హర్మీత్‌ (10), షాడ్లీ (11) పోరాడి స్కోరును వంద దాటించారు. మోనాంక్‌ గాయపడడంతో ఈ మ్యాచ్‌లో అమెరికాకు జోన్స్‌ నాయకత్వం వహించాడు.

అందుకే ఆ అయిదు పరుగులు

ఛేదనలో టీమ్‌ఇండియాకు 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సి రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ 16వ ఓవర్‌ ఆరంభానికి ముందు ఒక్కసారి సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారింది. భారత లక్ష్యంలో అయిదు పరుగులు కరిగిపోయాయి. దీనికో కారణం ఉంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఓవర్‌ ఓవర్‌కు మధ్య నిమిషం మాత్రమే విరామం ఉంటుంది. ఒక ఓవర్‌ ముగిశాక మరో ఓవర్‌ వేసేందుకు బౌలర్‌ 60 సెకన్ల లోపే సిద్ధమవ్వాలి. ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ జట్టు మూడు సార్లు ఇలా చేయడంలో విఫలమైతే అప్పుడు అంపైర్లు అయిదు పరుగులు జరిమానాగా విధిస్తారు. అమెరికా ఈ నిబంధనను అతిక్రమించడంతో పెనాల్టీ ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ క్యాచ్‌ పట్టుంటే..

44 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. 11వ ఓవర్లో కానీ భారత్‌ స్కోరు 50 దాటలేదు. పరుగుల రాక చాలా కష్టంగా ఉంది. అలాంటి స్థితిలో అసహనంతో సూర్య ఓ షాట్‌ ఆడాడు. థర్డ్‌మ్యాన్‌ బౌండరీ దగ్గర నేత్రావల్కర్‌ క్యాచ్‌ కోసం ప్రయత్నించాడు. బంతి చేజారింది. అప్పటికి సూర్య 30 బంతుల్లో 22 పరుగులే చేశాడు. ఈ వికెట్‌ పడి ఉంటే భారత్‌ మరింత ఇబ్బందుల్లో పడేదే. గెలిచేందుకు అమెరికాకు మంచి అవకాశం లభించేదే.

అమెరికా ఇన్నింగ్స్‌: జహంగీర్‌ ఎల్బీ (బి) అర్ష్‌దీప్‌ 0; స్టీవెన్‌ టేలర్‌ (బి) అక్షర్‌ 24; గౌస్‌ (సి) హార్దిక్‌ (బి) అర్ష్‌దీప్‌ 2; ఆరోన్‌ జోన్స్‌ (సి) సిరాజ్‌ (బి) హార్దిక్‌ 11; నితీశ్‌ కుమార్‌ (సి) సిరాజ్‌ (బి) అర్ష్‌దీప్‌ 27; కోరీ అండర్సన్‌ (సి) పంత్‌ (బి) హార్దిక్‌ 15; హర్మీత్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 10; షాడ్లీ నాటౌట్‌ 11; జస్‌దీప్‌ రనౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 8
మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 110;
వికెట్ల పతనం: 1-0, 2-3, 3-25, 4-56, 5-81, 6-96, 7-98, 8-110;
బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-9-4; సిరాజ్‌ 4-0-25-0; బుమ్రా 4-0-25-0; హార్దిక్‌ 4-1-14-2; దూబె 1-0-11-0; అక్షర్‌ 3-0-25-1

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) హర్మీత్‌ (బి) నేత్రావల్కర్‌ 3; కోహ్లి (సి) గౌస్‌ (బి) నేత్రావల్కర్‌ 0; పంత్‌ (బి) అలీ ఖాన్‌ 18; సూర్యకుమార్‌ నాటౌట్‌ 50; శివమ్‌ దూబె నాటౌట్‌ 31; ఎక్స్‌ట్రాలు 9
మొత్తం: (18.2 ఓవర్లలో 3 వికెట్లకు) 111;
వికెట్ల పతనం: 1-1, 2-10, 3-44;
బౌలింగ్‌: సౌరభ్‌ నేత్రావల్కర్‌ 4-0-18-2; అలీ ఖాన్‌ 3.2-0-21-1; జస్‌దీప్‌ సింగ్‌ 4-0-24-0; షాడ్లీ 4-0-25-0; కోరీ అండర్సన్‌ 3-0-17-0