ఏపీ ప్రజలకు తీపికబురు.. జూన్ 12, ముహూర్తం ఫిక్స్ చేసిన చంద్రబాబు

పాలనలో సాంకేతికత వినియోగానికి పెద్దపీట వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌)పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలోనే చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ సలహా మండలిలో గేట్స్‌ ఫౌండేషన్‌, ఐఐటీ మద్రాస్ సహా వివిధ రంగాల నిపుణులు సభ్యులుగా ఉండనున్నారు.


మరోవైపు జూన్‌ 12 కల్లా వాట్సాప్‌ గవర్నెన్స్‌ పరిధిలోకి అన్ని పౌర సేవలను తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. మనమిత్ర వాట్సాప్ సేవలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్న చంద్రబాబు.. జూన్ 12 నాటికి డిజిటల్ రూపంలో అందించే అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం 254 సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తోంది. అయితే 500 సేవల వరకూ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేందుకు అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇక ప్రత్యేక సలహా మండలి విషయానికి వస్తే ఏపీ ప్రజలకు మరింత మేలు చేసేలా ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట వచ్చనే దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి, ప్రభుత్వానికి తగిన సూచనలు, సలహాలు అందివ్వనుంది.

మరోవైపు దేశంలోనే తొలిసారిగా మన మిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించింది. ఈ విధానం ద్వారా ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్‌లలోని వాట్సాప్‌ను ఉపయోగించి వివిధ రకాల పౌర సేవలను సులభంగా పొందవచ్చు. 2025 జనవరి 30న ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రి నారా లోకేష్ మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభించారు. మన మిత్ర సేవల కోసం ఏపీ ప్రభుత్వం 95523 00009 అనే నంబర్‌ను కేటాయించింది. తొలి దశలో 161 పౌర సేవలు అందుబాటులోకి తేగా.. ఆ తర్వాత వీటిని 254కు పెంచారు. జనన, మరణ ధృవీకరణ పత్రాలు , ఆస్తి పన్ను చెల్లింపులు, ట్రేడ్ లైసెన్సులు, దేవాలయాల దర్శన టికెట్లు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బస్ టికెట్లు, పరీక్షల హాల్ టికెట్లు వంటి వాటిని అందుబాటులోకి తెచ్చారు.

ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఇంటి నుంచే సేవలు పొందేలా చేయడమే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉద్ధేశమని ప్రభుత్వం తెలిపింది. డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి వేగవంతమైన, పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలనను అందించడమే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ లక్ష్యమని తెలిపింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.