ఆర్టీసీ డిపోలు, గ్యారేజీలు, బస్టాండ్లలో తిరిగి.. వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేసి, కరపత్రాలు పంచిన పీటీడీ వైఎస్‌ఆర్ ఉద్యోగుల సంఘనేతల్లో మరికొందరిపై చర్యలు తీసుకోకుండా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సహా నలుగురిని సస్పెండ్ చేసి, చేతులు దులిపేసుకున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చి ప్రచారంలో పాల్గొన్నవారిపై చర్యలు తీసుకోలేదు. ఇందుకు ఓ సలహాదారు ఒత్తిడే కారణమని తెలిసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డితో కలిసి ప్రజా రవాణాశాఖ (పీటీడీ) వైఎస్‌ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, మరికొందరు వైయస్‌ఆర్ జిల్లా కడప, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల్లో గత నెల 31న ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ రుణం తీర్చుకుందామని వెంకట్రామిరెడ్డి పేరిట ముద్రించిన కరపత్రాలను ఉద్యోగులకు పంచారు. దీనిపై ‘ఈనాడు’లో ఈ నెల 2న కథనం ప్రచురితమైంది. అందులోని ఫొటోలో ఉన్నవారిపైనే చర్యలు తీసుకున్నారు. చల్లా చంద్రయ్య, బద్వేలు డిపోకు చెందిన ఎ.సుందరయ్య, ప్రొద్దుటూరు డిపోకు చెందిన రామచంద్రయ్య, కడప డిపోకు చెందిన ఫక్రుద్దీన్‌ను ఈ నెల 3న సస్పెండ్ చేశారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చి ప్రచారం చేసినవారి జోలికి వెళ్లలేదు. ఎవరెవరు ప్రచారం చేశారో పేర్కొంటూ.. వైయస్‌ఆర్ జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి (డీపీటీవో) నివేదిక ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మూడు జిల్లాల నుంచి హాజరు
డిపోల్లో ప్రచారం చేసినవారిలో తిరుపతి డిపోకు చెందిన కె.అర్జునయ్య, జి.నర్సింహులు, జీవీ ముని, ఒంగోలు డిపోకు చెందిన ఎ.రాధాకృష్ణ, బనగానపల్లి డిపోకు చెందిన బి.శ్రీపతి ఉన్నట్లు వైయస్‌ఆర్ డీపీటీవో నివేదిక ఇచ్చారు. బద్వేలు డిపోకు చెందిన ఎస్వీ సుబ్బయ్య గత నెల 31న సెలవు పెట్టి మరీ ఎన్నికల ప్రచారం చేసినట్లు గుర్తించారు. వీరంతా ఏయే డిపోల్లో ఎవరెవరిని కలిశారో కూడా తెలిపారు. అయినా పొరుగు జిల్లాల నేతలపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు.