T20 World Cup: 4 ఓవర్లు.. 4 మెయిడెన్లు.. 3 వికెట్లు

www.mannamweb.com


న్యూజిలాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన బౌలర్‌ ఘనత సాధించాడు.

న్యూజిలాండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ లాకీ ఫెర్గూసన్‌ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన బౌలర్‌ ఘనత సాధించాడు. పసికూన పాపువా న్యూగినీతో టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి 78 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటికే సూపర్‌-8కు దూరమైన న్యూజిలాండ్‌ ఘనవిజయంతో టోర్నీని ముగించింది.

తరౌబా (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో): న్యూజిలాండ్‌ జట్టు విజయంతో టీ20 ప్రపంచకప్‌ను ముగించింది. సూపర్‌-8కు చేరలేకపోయిన ఆ జట్టు సోమవారం నామమాత్రమైన తన ఆఖరి మ్యాచ్‌ (గ్రూప్‌-సి)లో 7 వికెట్ల తేడాతో పసికూన పాపువా న్యూగినీని చిత్తు చేసింది. కివీస్‌ బౌలర్ల ధాటికి మొదట న్యూగినీ 19.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది.

ఫెర్గూసన్‌ (4-4-0-3) సంచలన ప్రదర్శన చేశాడు. టీ20 చరిత్రలో.. కెనడా కెప్టెన్‌ సాద్‌ బిన్‌ జాఫర్‌ (4-0-4-2) తర్వాత నాలుగుకు నాలుగు ఓవర్లూ మెయిడెన్లు వేసిన రెండో బౌలర్‌గా అతడు నిలిచాడు. ఫెర్గూసన్‌తో పాటు బౌల్ట్‌ (2/14), సౌథీ (2/11) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో న్యూగినీ బ్యాటర్లు మ్యాచ్‌ ఆసాంతం పరుగుల కోసం చాలా కష్టపడ్డారు. 17 పరుగులు చేసిన అమిని టాప్‌ స్కోరర్‌. ఇష్‌ సోధి రెండు వికెట్లు పడగొట్టాడు. కివీస్‌ బౌలర్లు 83 డాట్‌ బాల్స్‌ వేయడం విశేషం. స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాన్వే (35) టాప్‌ స్కోరర్‌. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై మిచెల్‌ (19 నాటౌట్‌), విలియమ్సన్‌ (18 నాటౌట్‌) అభేద్యమైన నాలుగో వికెట్‌కు 25 పరుగులు జోడించారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన కివీస్‌ బౌలర్‌ బౌల్ట్‌కు ఇదే చివరి మ్యాచ్‌.

పాపువా న్యూగినీ: 78 (అమిని 17, నార్మన్‌ వనౌ 14, సెసె 12; ఫెర్గూసన్‌ 3/0, బౌల్ట్‌ 2/14, సౌథీ 2/11, ఇష్‌ సోధి 2/29);
న్యూజిలాండ్‌: 79/3 (కాన్వే 35, మిచెల్‌ 19 నాటౌట్, విలియమ్సన్‌ 18 నాటౌట్‌; మోరియా 2/4)