112/9.. 18 ఓవర్లకు విండీస్ స్కోరు ఇది. కానీ ఇన్నింగ్స్ ముగిసేసరికి 149. చివరి రెండు ఓవర్లలో రూథర్‌ఫర్డ్ విధ్వంసంతో 37 పరుగులు వచ్చాయి. ఆ ఆఖరి ఓవర్లలో రూథర్‌ఫర్డ్ చేసిన పరుగులే న్యూజిలాండ్ కొంపముంచాయి.
112/9.. 18 ఓవర్లకు విండీస్ స్కోరు ఇది. కానీ ఇన్నింగ్స్ ముగిసేసరికి 149. చివరి రెండు ఓవర్లలో రూథర్‌ఫర్డ్ విధ్వంసంతో 37 పరుగులు వచ్చాయి. ఆ ఆఖరి ఓవర్లలో రూథర్‌ఫర్డ్ చేసిన పరుగులే న్యూజిలాండ్ కొంపముంచాయి. ఆ జట్టు 13 పరుగుల తేడాతో ఓడింది. సొంత అభిమానుల మధ్య వరుసగా మూడో విజయంతో వెస్టిండీస్ సూపర్- 8కు దూసుకెళ్లింది.
టరౌబా
టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఈ టోర్నీకి ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న ఆ జట్టు హ్యాట్రిక్ విజయాలతో సూపర్- 8లో చోటు దక్కించుకుంది. గురువారం న్యూజిలాండ్‌తో గ్రూప్- సి మ్యాచ్‌లో విండీస్ 13 పరుగుల తేడాతో గెలిచింది. మొదట కరీబియన్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 149 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ షెఫానె రూథర్‌ఫర్డ్ (68 నాటౌట్; 39 బంతుల్లో 2×4, 6×6) అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. బౌల్ట్ (3/16), సౌథీ (2/21), ఫెర్గూసన్ (2/27) మెరిశారు. ఛేదనలో కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమైంది. అల్జారి జోసెఫ్ (4/19), గుడకేశ్ మోటీ (3/25) ప్రత్యర్థిని కట్టడి చేశారు. గ్లెన్ ఫిలిప్స్ (40; 33 బంతుల్లో 3×4, 2×6) టాప్‌స్కోరర్. న్యూజిలాండ్‌కిది వరుసగా రెండో ఓటమి. ఆ జట్టు సూపర్-8కు చేరడం ఇక కష్టమే.
పడగొట్టారు: బ్యాటింగ్‌కు కష్టంగా మారిన పిచ్‌పై న్యూజిలాండ్ బ్యాటర్లను స్పిన్నర్ మోటీ, పేసర్ అల్జారి పడగొట్టారు. ఫిలిప్స్ మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. ఓపెనర్లు పెవిలియన్ చేరడంతో కివీస్ 36/2తో పవర్‌ప్లేను ముగించింది. ఆ వెంటనే బంతి అందుకున్న మోటీ తన వరుస ఓవర్లలో విలియమ్సన్ (1), రచిన్ (10), డరిల్ మిచెల్ (12)ను ఔట్ చేసి కివీస్ నడ్డివిరిచాడు. రసెల్ బౌలింగ్‌లో ఓ ఫోర్, సిక్సర్, జోసెఫ్ ఓవర్లో రెండు ఫోర్లతో ఫిలిప్స్ పోరాడాడు. కానీ డెత్ ఓవర్లలో ఆ జట్టును అల్జారి దెబ్బకొట్టాడు. ముందుగా నీషమ్ (10)ను ఔట్ చేసిన అతను.. తర్వాతి ఓవర్లో వరుస బంతుల్లో ఫిలిప్స్, సౌథీ (0)ని వెనక్కి పంపడంతో కివీస్ పనైపోయింది. చివరి ఓవర్లో 33 పరుగులు కావాల్సి ఉండగా శాంట్నర్ (21 నాటౌట్) మూడు సిక్సర్లు ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగాయి.
ఆఖర్లో కేక: అంతకుముందు విండీస్ ఇన్నింగ్స్ ఆరంభమైన తీరు చూస్తే ఆ జట్టు 50 పరుగులైనా చేస్తుందా అనిపించింది. కివీస్ పేసర్లు చెలరేగడంతో 30 పరుగులకే సగం విండీస్ బ్యాటర్లు పెవిలియన్ చేరిపోయారు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో రెండో సారి మాత్రమే పవర్‌ప్లేలో క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫర్డ్ నిలబడ్డాడు. అకీల్ (15), రసెల్ (14), షెఫర్డ్ (13)తో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అయినా ఓ ఎండ్‌లో వికెట్లు పడటంతో విండీస్ 18 ఓవర్లకు 112/9తో నిలిచింది. అప్పటికీ రూథర్‌ఫర్డ్ రెండు సిక్సర్లే కొట్టాడు. ప్రత్యర్థిని త్వరగా ఆలౌట్ చేయాలనే ధ్యేయంతో బౌల్ట్, సౌథీ, ఫెర్గూసన్, నీషమ్‌తో విలియమ్సన్ అప్పటికే పూర్తి ఓవర్లు వేయించాడు. 19వ ఓవర్లో డరిల్ మిచెల్‌కు బంతి ఇవ్వాల్సి వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న రూథర్‌ఫర్డ్ పిడుగల్లే పడ్డాడు. మూడు సిక్సర్లు బాదేశాడు. శాంట్నర్ వేసిన చివరి ఓవర్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టి జట్టుకు మెరుపు ముగింపునిచ్చాడు.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (సి) కాన్వే (బి) నీషమ్ 9; ఛార్లెస్ (బి) బౌల్ట్ 0; పూరన్ (సి) కాన్వే (బి) సౌథీ 17; ఛేజ్ (సి) రచిన్ (బి) ఫెర్గూసన్ 0; పావెల్ (సి) కాన్వే (బి) సౌథీ 1; రుథర్‌ఫర్డ్ నాటౌట్ 68; అకీల్ (సి) నీషమ్ (బి) శాంట్నర్ 15; రసెల్ (సి) ఫెర్గూసన్ (బి) బౌల్ట్ 14; షెఫర్డ్ ఎల్బీ (బి) ఫెర్గూసన్ 13; అల్జారి జోసెఫ్ (బి) బౌల్ట్ 6; గుడకేశ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 149; వికెట్ల పతనం: 1-1, 2-20, 3-21, 4-22, 5-30, 6-58, 7-76, 8-103, 9-112; బౌలింగ్: బౌల్ట్ 4-1-16-3; సౌథీ 4-0-21-2; ఫెర్గూసన్ 4-0-27-2; నీషమ్ 4-0-27-1; గ్లెన్ ఫిలిప్స్ 1-0-9-0; శాంట్నర్ 2-0-27-1; డరిల్ మిచెల్ 1-0-19-0
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) ఛేజ్ (బి) అకీల్ 5; అలెన్ (సి) రసెల్ (బి) జోసెఫ్ 26; రచిన్ (సి) రసెల్ (బి) మోటీ 10; విలియమ్సన్ (సి) పూరన్ (బి) మోటీ 1; డరిల్ మిచెల్ (బి) మోటీ 12; ఫిలిప్స్ (సి) పావెల్ (బి) జోసెఫ్ 40; నీషమ్ (సి) కింగ్ (బి) జోసెఫ్ 10; శాంట్నర్ నాటౌట్ 21; సౌథీ (సి) అండ్ (బి) జోసెఫ్ 0; బౌల్ట్ (సి) ఛేజ్ (బి) రసెల్ 7; ఫెర్గూసన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 136; వికెట్ల పతనం: 1-20, 2-34, 3-39, 4-54, 5-63, 6-85, 7-108, 8-108, 9-117; బౌలింగ్: అకీల్ హొసీన్ 4-0-21-1; షెఫర్డ్ 3-0-36-0; రసెల్ 4-0-30-1; అల్జారి జోసెఫ్ 4-0-19-4; గుడకేశ్ మోటీ 4-0-25-3; రోస్టన్ ఛేజ్ 1-0-4-0