‘ఠాగూర్’ సీన్ రిపీట్.. మృతదేహానికి రోజంతా ట్రీట్‌మెంట్! రూ.4లక్షలు కట్టాలంటూ డిమాండ్

www.mannamweb.com


చిరంజీవి ‘ఠాగూర్‌’ మువీలో ఆస్పత్రి సీన్‌ గుర్తుందా? అందులో అవినీతికి అలవాటు పడ్డ డాక్టర్లు.. డెడ్‌ బాడీకి ట్రీట్‌మెంట్‌ చేస్తారు.

ఆనక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు లక్షల డబ్బు డిమాండ్‌ చేస్తారు. డెడ్ బాడీ కావాలంటే పూర్తి డబ్బు కట్టాల్సిందేనని ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారు. సరిగ్గా అలాంటి సంఘటనే హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. జడలు విప్పుకున్న దెయ్యంలా ఆ ఆస్పత్రిలో అవినీతి విలయతాండవం చేస్తుంది. అనారోగ్యంతో మరణించిన జూనియర్‌ డాక్టర్ మృతదేహంతో శ్మశానంలో రాబందుల్లా చుట్టుముట్టారు. అనంతరం కుటంబ సభ్యులకు ఆ డెడ్‌ బాడీ ఇచ్చేందుకు లక్షల్లో బేరసారాలు చేశారు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న మెడికోవర్ హాస్పిటల్‌లో వెలుగులోకి వచ్చింది.

నాగప్రియ అనే జూనియర్ డాక్టర్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న మెడికోవర్ హాస్పిటల్‌కి వచ్చారు. అయితే అక్కడ ఆమె వైద్యం చేస్తున్న క్రమంలో కుటుంబ సభ్యులను వెంటనే రూ.3 లక్షలు కట్టాలని, డబ్బు కడితేనే ట్రీట్‌మెంట్ చేస్తామని వైద్యులు తెలిపారు. దీంతో నాగప్రియ తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం రూ.3 లక్షలు కట్టారు. అయితే కాసేపటికే నాగప్రియ చనిపోయిందంటూ వైద్యులు తెలిపారు. అనంతరం హాస్పిటల్ యాజమాన్యం ఏమాత్రం కనికరం కూడా లేకుండా, మృత దేహంతో కూడా బేరసారాలకు దిగారు. నాగప్రియ డెబ్ బాడీ కావాలంటే రూ.4 లక్షలు కట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికే రూ. 3 లక్షలు చెల్లించామని మృతదేహాన్ని అప్పగించాలని మృతురాలి కుటుంబ సభ్యులు కళ్లావేళ్లాపడ్డా.. ఆసుపత్రి యాజమాన్యం కనికరించలేదు. డబ్బు కట్టేంత వరకు మృతదేహాన్ని ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో నాగప్రియ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతూ స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో తమ గోడు చెప్పుకుని బావురుమన్నారు. అరికెపూడి గాంధీ కాల్ చేసిన ఆసుపత్రి యాజమాన్యంలో తీరు మారలేదు.

డబ్బు కట్టేంత వరకూ తమ బిడ్డ మృతి చెందిన విషయం చెప్పలేదని, డబ్బు తెచ్చేంత వరకూ నాగప్రియకు వైద్యం ఆపేయడం వలనే చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మెడికోవర్‌ హాస్పిటల్ వద్ద బంధువులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. నాగప్రియ నిన్న రాత్రే చనిపోయిందని, డబ్బు కోసం ఆ వార్త చెప్పకుండా ఈ రోజు ఉదయం డబ్బు కట్టిన తర్వాత చెప్పడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న మెడికవర్ హాస్పిటల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్ద నిరసన కొనసాగుతుంది.