నిరీక్షణకు చెల్లు.. నచ్చినపుడే తీసుకెళ్లు.. జూన్‌ 1 నుంచి చౌక దుకాణాల్లో రేషన్‌ పంపిణీ

జిల్లాలో వచ్చేనెల ఒకటి నుంచి చౌక దుకాణాల ద్వారా కార్డుదారులకు రేషన్‌ పంపణీకి అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.


గత పాలనలో ఇంటింటికీ రేషన్‌ పేరుతో ఎండీయూ వాహనాలు తీసుకొచ్చారు. ఇంటి వద్దకు పంపకుండా కూడళ్లల్లో పెట్టి అందజేసేవారు. దానికోసం పడిగాపులు కాసేవారు. వేలమందికి అందేది కాదు. ఈ సమస్యను చక్కదిద్దేందుకు పాత విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ క్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారులు రేషన్‌ దుకాణాలకు సరకుల తరలింపు, కచ్చితమైన తూకంతో పేదలకు అందించేలా చర్యలు చేపడుతున్నారు. డీలర్ల వద్ద ఎలక్ట్రానిక్‌ తూకం యంత్రాలు చాలావరకు పాడైపోయాయి. వీటికి మరమ్మతులు, కొత్తవి ఏర్పాటు వంటివి తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేస్తున్నారు.

జిల్లాలో ఇలా..

  • చౌక దుకాణాలు: 1,060
  • రేషన్‌కార్డులు: 6,43,874
  • ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు: 7
  • బియ్యం: 9,300 టన్నులు
  • పంచదార: 395 టన్నులు

కచ్చితమైన తూకంతో..

రేషన్‌ సరకుల సరఫరాలో లోటుపాట్లపై డీలర్ల అభిప్రాయాలను సేకరించారు. పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో జిల్లా పౌరసరఫరాల అధికారి ఆర్‌ఎస్‌ఎస్‌ సత్యనారాయణరాజు, సహాయ సరఫరా అధికారి ప్రసన్నలక్ష్మి పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఎం.దేవులనాయక్‌తో భేటీ అయ్యారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్ద వేబ్రిడ్జిలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని కోరారు. తూకం వేసిన ప్రతీ సరకుకు రసీదులు ఇస్తామన్నారు. ఇప్పటికే సరకుల రవాణా చేపట్టామని, ఈనెల 30లోగా పూర్తి చేస్తామన్నారు. డీలర్లకు కచ్చితమైన తూకంతో సరకులిచ్చి, కార్డుదారులకు అంతే కచ్చితమైన తూకంతో అందించేలా చూస్తామని డీఎస్‌వో సత్యనారాయణరాజు చెప్పారు.

పిఠాపురంలో ప్రారంభించనున్న మంత్రి..!

చౌక దుకాణాల్లో రేషన్‌ పంపిణీ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఈనెల 1న పిఠాపురం నియోజకవర్గంలో ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు. ఖరారు కావాల్సి ఉందని చెబుతున్నారు. ఏర్పాట్లలో భాగంగా పిఠాపురం, గొల్లప్రోలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరకు తరలించడానికి పౌరసరఫరాల శాఖ, సంస్థల నుంచి ముగ్గురు చొప్పున అధికారులను నియమించారు. జేసీ రాహుల్‌మీనా ఆదేశాలతో ఏర్పాట్లు చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.