విజయవాడలోకి వెళ్లకుండానే హైదరాబాద్ హైవే ఎక్కేయండిలా..

గుంటూరు నుంచి ప్రయాణించే వారికి ఓ మంచి రూట్ అందుబాటులోకి రానుంది. విజయవాడ నగరంలోని రద్దీలో చిక్కుకోకుండా, సమయం ఆదా అయ్యేలా వెళ్లేందుకు వెస్ట్ బైపాస్ సిద్ధమైంది.


గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు ఇక విజయవాడ నగరంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే నేరుగా హైవే ఎక్కే అవకాశం రానుంది. విజయవాడ వెస్ట్ బైపాస్‌లో భాగంగా కాజ-గొల్లపూడి మధ్య హైవేను ఒకవైపు వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఇంకో వారం-పది రోజుల్లో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటగా కార్లు, మోటారు సైకిళ్లను మాత్రమే ప్రయోగాత్మకంగా అనుమతించనున్నారు.

ఎలా వెళ్లాలి?

చెన్నై-కోల్‌కతా హైవే మీదుగా ఒంగోలు, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు కాజ సమీపంలో వెస్ట్ బైపాస్‌లోకి ప్రవేశించి నేరుగా గొల్లపూడి చేరుకుంటాయి. అక్కడ నుంచి ఒకవైపు విజయవాడ-హైదరాబాద్ హైవేలోకి చేరి హైదరాబాద్ వెళ్లవచ్చు. మరోవైపు చిన్నఅవుటపల్లి మీదుగా ఏలూరు వైపు వెళ్లవచ్చు.

దీంతో గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగర ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా నేరుగా గమ్యానికి చేరుకునే వీలుంటుంది.

ప్రయాణ మార్గం ఇలా ఉంటుంది…

ప్రవేశం: గుంటూరు వైపు నుంచి వచ్చే వారు కాజ సమీపంలో వెస్ట్ బైపాస్‌లోకి ప్రవేశించాలి.

గొల్లపూడి వరకు: కాజ నుంచి గొల్లపూడి వరకు ఉన్న 17.88 కి.మీ. మార్గంలో ఒకవైపు రాకపోకలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్ వెళ్లాలంటే: గొల్లపూడి చేరుకున్నాక, అక్కడ విజయవాడ-హైదరాబాద్ హైవేలో కలవవచ్చు.

ఏలూరు వెళ్లాలంటే: గొల్లపూడి వద్ద కిందకు దిగాల్సిన అవసరం లేదు. నేరుగా బైపాస్ మీదుగా చిన్నఅవుటపల్లి చేరుకొని ఏలూరు రోడ్డు ఎక్కవచ్చు.

ప్రస్తుత పరిస్థితి – ఎవరికి అనుమతి?

సంక్రాంతి కానుక: సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి, మొదట కార్లు, మోటారు సైకిళ్లను మాత్రమే ఈ మార్గంలో అనుమతిస్తారు.

ఏప్రిల్ 1 నుంచి: ఏప్రిల్ నుంచి భారీ వాహనాలతో సహా అన్ని రకాల వాహనాలు ఇరువైపులా పూర్తిస్థాయిలో తిరగవచ్చు.

లైటింగ్ సౌకర్యం: కృష్ణానది వంతెనతో పాటు పాలవాగు, కొండవీటి వాగుల దగ్గర నిర్మించిన వంతెనల వద్ద ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా లైటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

అమరావతి (సచివాలయం/హైకోర్టు) వెళ్లే వారికి..

ఏలూరు లేదా గొల్లపూడి వైపు నుంచి వచ్చే వారు కూడా ఈ బైపాస్ వాడుకోవచ్చు.

కృష్ణానది వంతెన దాటాక టోల్ ప్లాజా సమీపంలో మంగళగిరి-మందడం రోడ్డు లోకి ప్రవేశించి సచివాలయం చేరుకోవచ్చు.

ఈ నెలాఖరుకల్లా హాయ్‌ల్యాండ్ రోడ్డు వరకు పనులు పూర్తి చేసి, అక్కడి సర్వీస్ రోడ్డు ద్వారా చెన్నై-కోల్‌కతా హైవేకి అనుసంధానం చేస్తారు.

ప్రధాన ప్రయోజనాలు…

విజయవాడ సిటీ ట్రాఫిక్, వారధి దగ్గర జాం అవ్వాల్సిన అవసరం లేదు.

గుంటూరు, ఒంగోలు, చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలు నేరుగా బైపాస్ ఎక్కేయొచ్చు.

గొల్లపూడి – చిన్నఅవుటపల్లి మధ్య 30 కి.మీ. ఆరు వరుసల హైవే ఇప్పటికే పూర్తి కావడంతో ప్రయాణం వేగంగా సాగుతుంది.

సూచన: ప్రస్తుతం ఇది ప్రయోగాత్మకంగా చిన్న వాహనాలకే అనుమతి ఇస్తున్నారు కాబట్టి, ప్రయాణికులు గమనించి ప్లాన్ చేసుకోగలరు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.