Home Loan: హోం లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా.. ఇలా చేస్తే రూ.లక్ష సేవ్ చేసుకోవచ్చు.

Joint Home Loans Benefits: ఇల్లు కొనుగోలు చేయడం జీవితంలో చాలామంది కల. ఇది కేవలం ఓ ఆస్తిని సంపాదించడమే కాదు. భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను అందించే ఒక సురక్షితమైన పెట్టుబడి. అయితే, ఈ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేసేందుకు జాయింట్ హోమ్ లోన్ తీసుకోవడం అత్యుత్తమ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధానం ద్వారా దంపతులు ఎక్కువ లోన్ అర్హతను పొందడమే కాకుండా భారీగా పన్ను మినహాయింపులను కూడా దక్కించుకోగలరు.


జాయింట్ హోమ్ లోన్ అంటే ఏమిటి..

జాయింట్ హోమ్ లోన్ అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి తీసుకునే లోన్. సాధారణంగా దంపతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. ఈ విధానంలో ఇద్దరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని బ్యాంకులు లోన్ మంజూరు చేస్తాయి. ఫలితంగా తక్కువ ఆదాయంతో ఒక్కరికి వచ్చే పరిమితులను అధిగమించి మెరుగైన ప్రాపర్టీ కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా, ఇలాంటి లోన్‌లో ఈఎంఐ భారం ఇద్దరు పంచుకునే అవకాశం ఉండటంతో ఆర్థిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

పన్ను ప్రయోజనాలెలా..

పన్ను ప్రయోజనాల పరంగా చూస్తే భారత ఆదాయపు పన్ను చట్టం ప్రకారం జాయింట్ హోమ్ లోన్‌పై ఉన్న కో-బారోవర్లు పన్ను మినహాయింపులను పొందే అవకాశం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా సెక్షన్ 80C కింద ప్రధాన చెల్లింపుపై మినహాయింపు లభిస్తుంది. ఒకరిద్దరూ కలిపి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపును పొందగలరు. అదేవిధంగా సెక్షన్ 24B కింద ఇంటి వడ్డీ చెల్లింపుపై గరిష్టంగా రూ.2 లక్షల వరకు మినహాయింపును పొందవచ్చు. ఈ విధంగా ఇద్దరూ కలిపి వార్షికంగా రూ.7 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

మహిళలకు స్పెషల్..

మహిళా రుణగ్రహీతలకు మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. చాలా బ్యాంకులు మహిళా ప్రైమరీ బారోవర్‌గా ఉన్నప్పుడు వడ్డీ రేటును 0.05 శాతం నుంచి 0.1 శాతం వరకు తక్కువగా అందిస్తాయి. కొన్ని రాష్ట్రాల్లో మహిళలకు స్టాంప్ డ్యూటీ కూడా తక్కువగా ఉంటుంది. ఇది ఒక కుటుంబానికి అదనపు పొదుపును అందించగలదు. ఈ పన్ను మినహాయింపులను పొందడానికి ఇద్దరూ కో-బారోవర్లుగా ఉండటంతో పాటు ఆస్తిలో కో-ఒనర్స్ కూడా కావాలి. అదే సమయంలో, ఈఎంఐ చెల్లింపులో ఇద్దరి పాత్ర కూడా స్పష్టంగా ఉండాలి. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను పాటిస్తూ సరైన లీగల్ డాక్యుమెంటేషన్‌ను నిర్వహించడం కూడా చాలా ముఖ్యం.

ఇల్లు కొనుగోలు అనేది పెద్ద నిర్ణయం. అయితే, జాయింట్ హోమ్ లోన్ ద్వారా దాన్ని మరింత ఆర్థిక ప్రయోజనంతో కూడినదిగా మార్చుకోవచ్చు. ఇది ఇంటి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచటమే కాకుండా, భారీ పన్ను ఆదా చేయడానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం చాలా మంచిదని చెప్పాలి.