రాబోయే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ (Talliki Vandanam Scheme) అమలు చేయాలనీ ఏపీ కేబినెట్ (AP Cabinet) నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 14 అంశాల ఎజెండాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
కాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించారు. ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 నిధులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పథకానికి సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ఖరారు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థికంగా పేద కుటుంబాలకు పెద్ద రిలీఫ్ ఉంటుంది. ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా అందరికీ ఈ నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థుల విద్య కోసం ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. ఈ పథకం అమలు చేసే సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థలు పేద కుటుంబాల ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ పథకం ద్వారా పిల్లలకు విద్యా వృద్ధి పథకాలను పూర్తి చేయడం, విద్యా కృత్యాలను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
ఈ పథకం ఆమోదం తో పాటు కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు (Key Decisions taken by the Cabinet) చూస్తే..
* గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం నదింపాలెం గ్రామంలో ఆరున్నర ఎకరాలు స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐసీ ఆస్పత్రి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
* ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదముద్ర
* రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో రూ.96,862 కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం
* రాష్ట్రంలో కొత్తగా ఐదు సంస్థలు క్లీన్ ఎనర్జీలో రూ.83 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
* విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ రూ.80 కోట్ల పెట్టుబడులకు అమోదం
* శ్రీ సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ ఎలక్ట్రిక్ త్రీ వీలర్ ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల కోసం రూ.1,046 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
* అనకాపల్లి జిల్లా రాంబిల్లిలోని 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,174 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
* చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్ బెటాలియన్ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ
* సీఎం చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్ రాష్ట్రంలోని నదుల అనుసంధానం గోదావరి టూ బనకచర్ల ప్రాజెక్ట్‌పై చర్చ
అలాగే ఈనెల 8వ తేదీన ప్రధాని రాష్ట్రానికి రానున్న తరుణంలో ఈ పర్యటనపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగింది. ప్రధాని మోదీ విశాఖలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇక నరేంద్ర మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.