నెల్లూరులో టాటా పవర్ ప్లాంట్.

పీ పై పెట్టుబడుల వర్షం కురుస్తుంది. కూటమి ప్రభుత్వం ఇందుకోసం సింగిల్ విండో విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన తర్వాత బడా కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయి.


ఈ క్రమంలోనే భారత దిగ్గజ కంపెనీ ఆంధ్రప్రదేశ్ కు తీపి కబురు చెప్పంది. దేశీయ సౌర పరికరాల తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు.. చైనా నుంచి దిగుమతి తగ్గించుకోవడానికి భారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పడానికి ప్రతిపాదన చేయగా.. కూటమి ప్రభుత్వం వెంటనే భూ కేటాయింపులు కూడా పూర్తి చేసింది.

టాటా పవర్ దేశంలో అత్యంత విశ్వాసం పొందిన సంస్థ. సౌర తయారీ రంగంలో కీలక మైలురాయిగా నిలిచేందుకు భారీ ప్రాజెక్టును ఏపీలో నెలకొల్పేందుకు సిద్ధమైంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కానుంది. దేశంలోనే అతిపెద్దదైన 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్, వేఫర్ తయారీ ప్లాంట్‌ను నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయాలని సంస్థ నిర్ణయించింది. సుమారు రూ. 6,675 కోట్లు ప్రాజెక్టు ఇది. సెమీకండక్టర్ చిప్స్, సౌర సెల్స్, సౌర మాడ్యూల్స్ తయారీలో ఇంగాట్లు, వేఫర్లు అత్యంత కీలకమైన ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి.

భూ కేటాయింపు పూర్తి..

టాటా పవర్ ప్రతిపాదనకు రెడ్ కార్పెట్ పరిచింది ఏపీ ప్రభుత్వం. నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) వద్ద మొత్తం 200 ఎకరాల భూమిని వెంటనే కేటాయించింది. ఇందులో 120 ఎకరాలు నేరుగా ప్లాంట్ నిర్మాణానికి.. 80 ఎకరాలను డెవలప్‌మెంట్ కోసం ఉపయోగించబోతున్నారు. టాటా గ్రూప్ నుంచి మరో కీలక పెట్టుబడిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం తమకు గర్వకారణమని ఐటీ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఈ వారం చివర్లో ఈ ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదం దక్కబోతుందన్నారు.

ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలు..

భారత్ లో సోలార్ పరికరాల తయారీ సామర్థ్యాన్ని పెంచడం, ముఖ్యంగా చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడం కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ యూనిట్ ద్వారా దాదాపు వెయ్యి మందికి ప్రత్యక్ష జాబ్స్ రాబోతున్నాయి. అంతేకాదు, ఈ ప్లాంట్‌కు అవసరమైన విద్యుత్‌ను పూర్తిగా రెన్యువల్ ఎనర్జీ నుంచే వాడబోతున్నారు. నెల్లూరు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఉన్నందున అక్కడి నుంచే ఈ యూనిట్ కు విద్యుత్ సరఫరా జరగబోతుంది.

నెల్లూరు లోనే ఎందుకంటే..

ఈ ప్రాజెక్ట్ కోసం టాటా పవర్ దేశంలోని కీలక ప్రాంతాలను పరిశీలించింది. అందులో ఒడిశాలోని గోపాల్‌పూర్, కటక్ కూడా ఉన్నాయి. అయితే కృష్ణపట్నం పోర్టుకు ప్రస్తుతం కేటాయించిన భూమి అతి సమీపంలో ఉన్నందున టాటా పవర్ ఏపీకి వచ్చేసింది. మెరుగైన లాజిస్టిక్స్ సదుపాయాలు కూడా ఉండటంతో పాటు ఏపీ ప్రభుత్వం పెట్టుబడులకు సింగిల్ విండో విధానాన్ని అవలంభిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఈ ప్రాజెక్ట్ దక్కింది.. ఇప్పటికే ప్రీమియర్ ఎనర్జీస్, వెబ్‌సోల్, వోల్ట్‌సన్ వంటి కంపెనీలు ఈ ప్రాంతంలో సౌర తయారీ ప్రాజెక్టులను ప్రారంభించడంతో నెల్లూరు వేగంగా సౌర ఉత్పాదక కేంద్రంగా మారుతోంది.

గత ఏడాది మార్చి 7న టాటా పవర్ ఏపీ ప్రభుత్వంతో (MoU) కుదుర్చుకుంది.ఇందులో భాగంగా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 49,000 కోట్ల వరకు పెట్టుబడి పెట్టేందుకు టాటా గ్రూప్ అంగీకరించింది. ఆ ఒప్పందంలో భాగంగా నెల్లూరు ఇంగాట్-వేఫర్ ప్లాంట్‌ను తొలి తయారీ ప్రాజెక్టుగా గుర్తించారు.

దేశంలో టాటా పవర్ యూనిట్లు..

ప్రస్తుతం TPREL దేశవ్యాప్తంగా అనేక భారీ సౌర ప్రాజెక్టులను నిర్వహిస్తోంది. 300 మెగావాట్ల ప్లాంట్ గుజరాత్‌లోని ధోలేరాలో ఉండగా, కర్ణాటకలోని పావగడలో 400 మెగావాట్ల యూనిట్ ఉంది. ఇక రాజస్థాన్‌లోని బికనీర్‌లో 450 మెగావాట్ల ప్రాజెక్టు, మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌లో 431 మెగావాట్ల యుటిలిటీ-స్కేల్ ప్రాజెక్ట్ ను విజయవంతగా నిర్వహిస్తుంది టాటా పవరన్. నెల్లూరు ప్రాజెక్టుతో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ తయారీ రంగంలో తన స్థానాన్ని మరింత బలపరచనుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.