టీడీపీ ఆఫీసుపై దాడి కేసు: కోర్టులో లొంగిపోయిన ప్రధాన నిందితుడు

www.mannamweb.com


ఏపీలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​పై దాడి కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు.

TDP ఆఫీస్‌పై దాడిలో ఇతను ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పానుగంటి చైతన్య.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు..
2021 అక్టోబర్‌ 19న మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్‌పై మూక దాడి జరిగింది. నాటి కేసు విచారణ స్పీడప్‌ చేసిన పోలీసులు ఇప్పటికే 100 మందిని గుర్తించి వారిపై కేసులు పెట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు ముందస్తు బెయిల్‌ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం వారు మంగళగిరి రూరల్‌ PSలో విచారణకు హాజరవుతున్నారు.

తాజాగా ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్య అజ్ఞాతం వీడారు. మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. ఇతను వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పరెడ్డి ప్రధాన అనుచరుడు. ఇప్పటికే ఇదే కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేశారు.. ఆయనకు బెయిల్‌ వచ్చినా మరో కేసులో అరెస్టైన కారణంగా జైల్లోనే ఉన్నారు. ఇక చైతన్య లొంగుబాటు నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న మిగతా వారు కూడా బయటకు వస్తారా.. విచారణలో ఏం జరుగుతుంది అనేది కీలకంగా మారింది.

మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా సోమవారం వైసీపీ నేతలు మంగళగిరి పీఎస్‌లో పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాంతోపాటు.. దేవినేని అవినాష్‌ సెల్‌ఫోన్లు ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే ఫోన్లు ఇచ్చేందుకు వైసీపీ నేతలు నిరాకరించారు. కోర్టు ఆదేశాలతోనే సెల్‌ఫోన్లు ఇస్తామన్నారని.. కేసు సీఐడీకి బదిలీపై ఇంకా ఆదేశాలు అందలేదని మంగళగిరి సీఐ తెలిపారు.