ఊహించని మలుపు తిరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసు

కృష్ణాజిల్లా గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు ప్రాసిక్యూషన్‌లో ఎదురుతిరిగాడు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని న్యాయాధికారి ముందు వాంగ్మూలం ఇచ్చాడు.


వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు టీడీపీ కార్యాలయంలో కర్రలు, రాళ్లతో బీభత్సం సృష్టించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ముదునూరు సత్యవర్ధన్‌ ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ఈ కేసు సీఐడీకి బదిలీ అయింది. మొత్తం 88 మందిని నిందితులుగా చేర్చారు.

వారిలో 39మంది ముందస్తు బెయిల్‌ కోసం విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ జరుగుతోంది. న్యాయాధికారి హిమబిందు సోమవారం బెయిల్‌ పిటిషన్లపై వాదనలు పూర్తయిన తర్వాత సత్యవర్ధన్‌ను న్యాయాధికారి విచారించారు. తనకు, ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని, పోలీసులు సాక్షిగా సంతకం తీసుకుని తనను ఫిర్యాదుదారుడిని చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన అఫిడవిట్‌ను అందజేశారు. తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని, టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు అక్కడ లేనని స్పష్టం చేశారు. ఆయన వాంగ్మూలాన్ని న్యాయాధికారి నమోదు చేసుకున్నారు. అనంతరం విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.