పేరుపెట్టి పిలిచాడని విద్యార్థి ముఖం వాచిపోయేలా కొట్టిన టీచర్‌..!

China teacher : విద్యార్థి తనపై కనీస గౌరవం చూపకుండా పేరుపెట్టి పిలవడంతో టీచర్‌ ఆగ్రహం పట్టలేకపోయారు. సరసరా విద్యార్థి దగ్గరికి వెళ్లి ముఖం వాచిపోయేలా కొట్టారు. చైనాలో జరిగిన ఈ ఘటన వివాదాస్పదమైంది. విద్యార్థి తల్లిదండ్రులు ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఘటనపై విచారణ జరుపనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం టీచర్‌ను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది.


వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 14న చైనాలోని షాండోంగ్‌ ప్రావిన్స్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థులకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ క్లాస్‌ జరుగుతున్నది. యాక్టివిటీస్‌ పూర్తిచేసిన తర్వాత స్కూల్‌ గ్రౌండ్‌లో విద్యార్థులు సేదదీరుతున్నారు. ఈ సందర్భంగా వారి పక్కనుంచి మ్యాథ్స్‌ టీచర్‌ వెళ్లడాన్ని విద్యార్థులు గమనించారు. విద్యార్థుల్లో ఒకరు అతడిని పేరుపెట్టి గట్టిగా పిలిచాడు. దాంతో ఆగ్రహించిన టీచర్‌ విద్యార్థిని సమీపించి ముఖంపై ముఖంపై ఇష్టంవచ్చినట్లు కొట్టారు.

టీచర్‌ దెబ్బలకు విద్యార్థి ముఖం వాచిపోయింది. విద్యార్థి ద్వారా విషయం తెలుసుకున్న పేరెంట్స్‌ స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు. స్కూల్ యాజమాన్యం టీచర్‌ను విధుల నుంచి తప్పించింది. విద్యార్థి తప్పుచేస్తే పేరెంట్స్‌కు చెప్పాల్సిందని, భౌతిక దాడికి పాల్పడటం కరెక్టు కాదని పేరెంట్స్‌ అంటున్నారు.

కాగా, విద్యార్థికి సభ్యత, సంస్కారం ఏమాత్రం లేవని, ఒక టీచర్‌ను అన్న కనీస గౌరవం కూడా లేకుండా పేరుపెట్టి గట్టిగా పిలిచాడని, ఎగతాళి చేశాడని, అందుకే ఆగ్రహంతో కొట్టానని టీచర్‌ చెబుతున్నారు. పేరెంట్స్‌ కూడా పిల్లలకు సంస్కారం నేర్పాలని అన్నారు.