ఉపాధ్యాయుడిని క్లాస్ రూమ్‌లోనే కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు

www.mannamweb.com


అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో చోటు చేసుకున్న ఘటన అందరిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఏజాస్ అనే టీచర్‌ను 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్‌లోనే కొట్టి చంపారు.

ఈ సంఘటన విద్యార్థుల ప్రవర్తనపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

విద్యార్థులు అల్లరి చేస్తుండటంతో ఉపాధ్యాయుడు ఏజాస్ వారిని మందలించారు. దీంతో విద్యార్థులు కోపంతో ఒక్కసారిగా ఉపాధ్యాయుడు ఏజాస్ ఫై దాడి చేసారు. చాతిపై పిడికిలితో బలంగా కొట్టడంతో ఏజాస్ అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఏజాస్‌ను ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతున్నప్పటికీ ఆయన ప్రాణాలు నిలవలేదు. ఏజాస్ మరణ వార్త ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను తీవ్ర దుఃఖానికి గురిచేసింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్న విద్యార్థులపై చర్యలు తీసుకునే దిశగా పోలీసు అధికారులు పని చేస్తున్నారు.

పాఠశాలలలో నైతిక విద్యాభ్యాసం, విద్యార్థుల ప్రవర్తనపై పునరాలోచన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉపాధ్యాయుల పట్ల గౌరవం, సహనం వంటి విలువలను విద్యార్థుల్లో నాటడం ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేయగలదని భావిస్తున్నారు.