టీచర్లే మా అంబాసిడర్లు – గత ప్రభుత్వం ఉపాధ్యాయులను అవమానించేలా…అనుమానించేలా చూసింది -cm

www.mannamweb.com


ఉపాధ్యాయులు తేనెటీగల్లాంటి వారు. వాటి పని అవి చూసుకుంటూ ఉంటాయి. ఎవరైనా గులకరాయితో తేనెతుట్టెను కదిలిస్తే మాత్రం మూకుమ్మడిగా దాడిచేస్తాయి. టీచర్లు కూడా అంతే. వారికి పదోన్నతులు ఇద్దామని నిర్ణయించినప్పుడు ఎంతో మంది ఇలా నన్ను భయపెట్టారు. ఏదైనా తేడా అయితే ఇబ్బంది అవుతుందని చెప్పారు. నాకు వేరే స్వార్థం లేదు. నమ్మించి మోసం చేయాలనీ లేదు. వారికి పదోన్నతులు ఇవ్వడం సమంజసం.. పరిష్కరించాలని అధికారులకు చెప్పా. మా ప్రయత్నం విజయవంతమైంది.

– సీఎం రేవంత్‌రెడ్డి

టీచర్లతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఏవీఎన్‌ రెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నం ప్రభాకర్, శాంతికుమారి, ఆచార్య కోదండరాం, లక్ష్మణ్‌కుమార్‌

‘తెలంగాణ ప్రజలు దొరల గడీల్లో బందీ కాకూడదు.. పేదరికం నుంచి విముక్తి కలగాలంటే చదువే మార్గం. పేద పిల్లలకు అంకితభావంతో చదువు చెప్పే బాధ్యత మీదే. మా ప్రభుత్వానికి మీరే బ్రాండ్‌ అంబాసిడర్లు. మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. ఈ ప్రభుత్వం మొన్న నిలబడిందన్నా, రేపు మళ్లీ గెలవాలన్నా మీ సహకారం ఉండాలి. మీరు పేద పిల్లలకు విద్య నేర్పించండి. మీకు ఏం కావాలన్నా చేసే బాధ్యత మాది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ నిర్బంధ సంకెళ్లు తెగాలంటే పేదలకు నాణ్యమైన చదువు అందించి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. రాష్ట్రంలో ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయులతో హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ముఖాముఖి సభలో ఆయన ప్రసంగించారు. దిల్లీలో కేజ్రీవాల్‌ మూడు సార్లు గెలిచారంటే కారణం బస్తీల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను చేరువ చేయడమేనన్నారు. మరోసారి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉండాలంటే ఇక్కడా చదువులు బాగుండాలన్నారు. బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆచార్య కోదండరాం, పలువురు ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.

వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయ సిబ్బంది

తెలంగాణ భవిష్యత్తు మీ రూపంలోనే ఉంది
‘‘గత డిసెంబరులో మా ప్రభుత్వం ఏర్పాటుకు మీరు శాయశక్తులా సహకరించారు. ఆచార్య కోదండరాంతో మాట్లాడి.. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నేను సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఎల్బీ స్టేడియంలోనే పదోన్నతులు పొందిన మీతో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ క్షణంలో తెలంగాణ భవిష్యత్తు ఎక్కడుందని ఎవరైనా అడిగితే.. ఎల్బీ స్టేడియంలో మీ రూపంలో ఉందని చెబుతాను. తెలంగాణ సాధనలో ఉపాధ్యాయులది క్రియాశీల పాత్ర. రాష్ట్రంలో 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది పేద పిల్లల భవిష్యత్తును తల్లిదండ్రులు మీ చేతుల్లో పెట్టారు. అందుకే తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని చెబుతున్నా.

రాష్ట్రంలో 10 వేల ప్రైవేటు బడుల్లో 33 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు.. 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 26 లక్షల మందే ఉన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ఇంకా 2 లక్షల మంది తగ్గారు. మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా.. ప్రైవేటులో పనిచేసే టీచర్లు మీకంటే ఎక్కువ చదువుకున్నారా? అక్కడ ఇంటర్‌ పాసైన వారు.. డిగ్రీ తప్పినవారు ఉన్నారు. అయినా ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గుతున్నారంటే ఎక్కడో లోపం ఉంది. అందుకు కేవలం ఉపాధ్యాయులను నిందించాలనుకోవడం లేదు. మా(పాలకుల) వైపు కూడా లోపం ఉండొచ్చు. మౌలిక వసతులు కల్పించకపోవడం, అమ్మాయిలకు మూత్రశాలలు ఏర్పాటు చేయలేకపోవడం లాంటి పలు కారణాలు ఉండొచ్చు. దీనిపై మనం ఆలోచన చేయాలి.

10 శాతం నిధులు ఇద్దామనుకున్నాం…
రాష్ట్రంలో విద్యావ్యవస్థ బాగుపడాలని భావించా. అందుకే బడ్జెట్‌లో 10 శాతం నిధులు కేటాయించాలనుకున్నాం. ఇతర హామీలను నెరవేర్చాలని చివరకు 7.3 శాతం.. అంటే రూ.21 వేల కోట్లకుపైగా నిధులు ఇచ్చాం. వేల మంది పదవీ విరమణకు ముందు ఒక్క పదోన్నతైనా పొందుతామా? అని ఎదురుచూశారు. భాషా పండితులైతే 20 ఏళ్లుగా పదోన్నతుల కోసం చేయని ప్రయత్నం లేదు. వాటన్నిటికి పరిష్కారం చూపాం. దాదాపు 30 వేల మందికి పదోన్నతులు దక్కాయి. మరో 30 వేల మందిని బదిలీ చేశాం. అందుకే మీ ముందుకు ధైర్యంగా వచ్చా. ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తాం. నిన్న ఒకాయన గుంటూరు, అమెరికాలో పెద్ద చదువులు చదివానని చెప్పారు. ఆయనకు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేదేమో. నేను మాత్రం సర్కారు బడుల్లోనే చదువుకున్నా. మీరు చెప్పిన పాఠాలతోనే సీఎంను అయ్యా. ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడ్డాను. ఊళ్లో బడికి పంపిస్తే ఏమైనా అనుకుంటారేమోనని కొందరు భావిస్తుంటారు. అది మారాలి. ప్రభుత్వ బడిలో పిల్లల్ని చదివించడం ఆత్మగౌరవంగా భావించేలా చూడాలి. అందుకే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసి వసతులు కల్పిస్తున్నాం. మీతో చర్చించడానికి మాకు ఇబ్బందులు, బేషజాలు లేవు. బడుల్లో పారిశుద్ధ్యం బాధ్యత అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా సహాయ సంఘాలకు అప్పగిస్తున్నాం. అందుకు రూ.79 కోట్లు ఇస్తున్నాం. ఇళ్లకు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్నప్పుడు విద్యతోనే తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉన్నప్పుడు బడులకు ఉచిత విద్యుత్తు వద్దా? అని ఆలోచించాం. అందుకే 30 వేల ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తు సరఫరా చేయాలని విద్యుత్తు శాఖకు ఆదేశాలిచ్చాను.

మన విద్యావేత్తల్ని అవమానించారు
తెలంగాణ వస్తే విద్యా విధానం మెరుగవుతుందని అనుకున్నాం. చుక్కా రామయ్య, కోదండరాం, హరగోపాల్‌ లాంటి వారికి గౌరవం దక్కుతుందని భావించాం. అవమానించే విధంగా.. అనుమానించే విధంగా చూశారు. ఒకప్పుడు మోహన్‌రెడ్డి లాంటి ఉపాధ్యాయ సంఘ నేతలు వస్తే చంద్రబాబు, వైఎస్‌ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వారు కూడా ఎదురొచ్చి సమస్యలు విని పరిష్కరించేవారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైందో మీకు తెలియంది కాదు. ఎల్బీస్టేడియం నుంచి అందరూ స్ఫూర్తి నింపుకొని వెళ్లాలి. ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్యను పెంచుదాం.. బడులను, పిల్లల్ని తీరిదిద్దుతామని ప్రతిజ్ఞ చేద్దాం. మీరు సిద్ధమేనా?’’ అని సీఎం అన్నారు. సీఎస్‌ శాంతికుమారి మాట్లాడుతూ త్వరలో 11,062 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయబోతున్నాని చెప్పారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూర రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డి, ఏవీఎన్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాల్‌రావు, షబ్బీర్‌ అలీ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు రామచంద్రునాయక్, లక్ష్మణ్‌కుమార్, ఉపాధ్యాయ సంఘాల నేతలు బీరెల్లి కమలాకర్‌రావు, మారెడ్డి అంజిరెడ్డి, జంగయ్య, పర్వత్‌రెడ్డి, కటకం రమేశ్, సి.జగదీశ్, చెన్నయ్య, కృష్ణుడు, హనుమంతరావు, వీరాచారి, నానావత్‌ సురేష్, చందూరి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.