జిల్లా విద్యా శాఖను కుదిపేస్తున్న 14 మంది ఉపాధ్యాయుల సస్పెన్షన్, ఐదుగురు విద్యార్థుల డిబార్ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు చేరింది. నాలుగు రోజులుగా ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో చేపడుతున్న ఆందోళనలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు గురువారం ఉమ్మడి వేదిక ప్రతినిధులతో గంటసేపటికి పైగా మాట్లాడి వివరాలు సేకరించారు. డీఈవోను విధుల నుంచి తప్పించాలని, బాధిత ఉపాధ్యాయులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని.. క్రిమినల్ కేసులు వెనక్కి తీసుకోవాలని, విద్యార్థులకు వెంటనే పరీక్ష నిర్వహించాలని, లేకుంటే సప్లిమెంటరీకి అనుమతి ఇవ్వాలని ఉమ్మడి వేదిక కన్వీనర్లు తంగి మురళీమోహనరావు, మజ్జి మదన్‌మోహన్, చౌదరి రవీంద్ర డిమాండు చేశారు. సాయంత్రం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు హాజరై డీఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఈవో ఉపాధ్యాయ, విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఓ ఉపాధ్యాయుడు శీర్షాసనం వేసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. డీఈవో అక్రమాలపై విచారణ చేపట్టి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
మధ్యవర్తులతో చర్చలు..
పీఆర్‌టీయూ నేతలు విద్యాశాఖ కమిషనర్‌ను కలిసి డీఈవో తిరుమల చైతన్య తీరుపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. త్వరలో ఈ వ్యవహారంపై ఆర్జేడీ విచారణ చేసే అవకాశాలున్నాయని సమాచారం. జిల్లాలో అధిక శాతం ఉపాధ్యాయులు డీఈవోకు వ్యతిరేకమైన నేపథ్యంలో సంఘ నేతలతో ఆయన మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిపారు. ఇప్పటికే సస్పెండ్ చేసిన ఉపాధ్యాయుల నుంచి వివరణలు తీసుకున్నారని, వాటి ఆధారంగా సస్పెన్షన్లు ఎత్తి వేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ విజేత గాదె శ్రీనివాసులునాయుడు సైతం డీఈవో తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.