ట్రంప్ సర్కార్ H1బీ వీసా ఫీజును లక్ష డాలర్లు (రూ.88 లక్షలు) పెంచడం భారతీయ టెకీలను తీవ్ర ఆందోళనకు గురిచేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైట్హౌస్ మళ్లీ క్లారిటీ ఇచ్చింది.
ఇప్పటికే H1బీ వీసాలు ఉన్నవారికి ఈ ఫీజు వర్తించదని కొత్తగా తీసుకునేవారికోసమేనని స్పష్టం చేసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వైట్హౌస్ ఈ క్లారిటీ ఇవ్వకముందు తీవ్ర గందరగోళం నెలకొంది. చాలావరకు అమెరికన్ కంపెనీలు విదేశాల్లో ఉన్న హెచ్1బీ వీసాదారులను వెంటనే అమెరికాకు వచ్చేయాలని కోరాయి. దీంతో చాలామంది అమెరికాకు పయనమయ్యారు. దీనివల్ల ఫ్లైట్ ఛార్జీలు కూడా బాగా పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలోనే నాగపూర్లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఇటీవల తన తండ్రి వర్ధంతి కారణంగా అమెరికా నుంచి నాగపూర్కు వచ్చాడు. అయితే హెచ్1 బీ వీసా ఫీజును పెంచడం, ఇతర విషయాల్లో అనుమానాలు రావడంతో అమెరికా కంపెనీలు తమ ఉద్యోగును వెంటనే తిరిగిరావాలని సూచించాయి. దీంతో అతడు అత్యవసర విమాన టికెట్ల కోసం ఏకంగా 8 వేల డాలర్లు (మన కరెన్సీలో రూ.7 లక్షలు) ఖర్చు చేశాడు.
తాను 11 ఏళ్ల పాటుగా అమెరికాలో కుటుంబంతో గడిపిన తర్వాత ఇలా తమ భవిష్యత్తుపై గందరగోళ పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. తన కూతురు పుట్టినప్పటినుంచి పూర్తిగా అమెరికాలోనే గడుపుతోందని ఆమె ఒకవేళ ఇండియాకు తిరిగి వస్తే పరిస్థితి ఏంటని వాపోయాడు. ఇదిలాఉండగా ట్రంప్ ప్రభుత్వం హెచ్1బీ వీసా ధరలు పెంచడంతో భారతీయ ఐటీ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి కంపెనీల షేర్ల విలువలు కుప్పకూలుతున్నాయని నిపుణులు తెలిపారు. అమెరికాలో తమ దేశస్థులను అనేక కంపెనీలు తొలగిస్తున్నాయని.. ముందుగా అమెరికన్ కంపెనీలు తమ దేశస్థులకే ప్రాధాన్యం ఇవ్వాలని, అందుకే హెచ్1బీ వీసా రూల్స్ కఠినతరం చేసినట్లు పేర్కొంది.
































