Telangana: ఉచిత బస్సు ప్రయాణం తొలగించనున్న ప్రభుత్వం?

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో మొదటి హామీని నెరవేర్చేసింది. అదే మహాలక్ష్మి పథకంలో (Mahalakshmi Scheme) భాగంగా తెలంగాణ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం.
దాంతో తెలంగాణ మహిళలంతా ఎంతో హర్షం వ్యక్తం చేసారు. హాయిగా ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తూ ట్రిప్స్‌ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు బాలేవు. ఈ ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆల్రెడీ ఆర్టీసీ ఆదాయం దారుణంగా పడిపోయింది. దీనికి తోడు పాపం విద్యార్థులు, మగవారికి ఆర్టీసీలో ప్రయాణం చాలా కష్టంగా మారిపోయింది.


ఒకప్పుడు ఏదన్నా పని ఉంటే మాత్రమే బస్సుల్లో ప్రయాణించేవారు. అప్పుడు ఆటోలు కూడా ఎక్కువగా ఎక్కేవారు. కానీ ఎప్పుడైతే ఉచితం అన్నారో.. అసలు బస్సు ముఖం చూడని వారు కూడా ప్రయాణించేస్తున్నారు. బస్సుల్లో సీట్లు దొరక్క దిగిపోవడం.. సీట్ల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకోవడం వంటి సంఘటనలు కూడా జరిగాయి.

సరదా సరదాగా..

ఓసారి ఆర్టీసీ బస్ కండక్టర్‌కి వింత అనుభవం ఎదురైంది. జూబ్లీ బస్ స్టేషన్ వద్ద బస్సు ఎక్కిన ఓ మహిళ మహబూబ్‌నగర్‌లో దిగిందట. ఆ బస్సు చివరి స్టాప్ కూడా మహబూబ్‌నగరే. అయితే మళ్లీ బస్సు తిరిగి జూబ్లీ బస్ స్టేషన్‌కు వెళ్తోందని తెలిసి ఆ మహిళ కూడా ఎక్కింది. దాంతో కండక్టర్ ఆమె వద్దకు వెళ్లి దారి మర్చిపోయావా అమ్మా అని అడిగాడు. దానికి ఆమె చెప్పిన సమాధానం విని షాకయ్యాడు. తాను దారి మర్చిపోలేదని.. ఉచిత బస్సులు కావడంతో అటూ ఇటూ సరదాగా తిరుగుతున్నానని చెప్పింది.

చీపురు కొనడానికి..

మరో ఘటనలో ఓ మహిళ తన గ్రామంలోని బస్సు ఎక్కి పట్టణానికి వెళ్లి చీపుర్లు కొనుగోలు చేసుకుని వచ్చింది. ఇలా అసలు అవసరం లేకపోయినా కూడా బస్సులు ఎక్కేసి ఉచిత ప్రయాణాన్ని వాడేసుకుంటున్నారు. రోజూ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజ్‌లకు వెళ్లే వారికి మాత్రం ఈ ఉచిత ప్రయాణం చాలా కష్టంగా మారుతోంది. వారికి సమయానికి బస్సులు దొరక్క ఆటోలు, క్యాబ్‌లు పట్టుకుని పోతున్నారు.
ఈ నేపథ్యంలో ఆర్టీసీకి పలు ఫిర్యాదులు అందాయి. ఉచిత ప్రయాణం వల్ల చాలా మందికి లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని.. ఆటో డ్రైవర్లకు గిరాకీ లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బోలెడు ఫిర్యాదులు అందాయి. దాంతో తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు పథకంపై కీలక నిర్ణయం తీసుకోనుంది. పూర్తిగా ఉచితంగా కాకుండా సగం ధరకు టికెట్లు కొనుగోలు చేసే విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆల్రెడీ మహారాష్ట్రలో ఈ విధానాన్నే అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం.