తెలంగాణ పాలీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ వచ్చేసింది

తెలంగాణ పాలీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) పూర్తి వివరాలతో ప్రకటన జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మార్చి 19 మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా..


తెలంగాణ పాలీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ ఎట్టకేలకు విడుదలైంది. గత కొన్ని రోజులుగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణకు తెరపడినట్లైంది. 2025-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (SBTET) పూర్తి వివరాలతో తాజాగా ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ మార్చి 19 నుంచి ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు పాలిసెట్‌ కన్వీనర్‌ పుల్లయ్య షెడ్యూల్‌ విడుదల చేశారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తు ఫీజు రూ.250, ఇతరులకు రూ.500గా నిర్ణయించారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 21 వరకు, రూ.300తో 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇక పాలీసెట్‌ 2025 పరీక్ష మే 13న నిర్వహించనున్నారు.

ఇంజినీరింగ్, ఇతర వృత్తివిద్యాకోర్సులకు ఇటీవల ప్రభుత్వం జారీచేసిన నిబంధనల మాదిరిగానే పాలిటెక్నిక్‌ సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులకే కేటాయించనున్నట్లు నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. పాలిటెక్నిక్‌లలో మొత్తం కన్వీనర్‌ కోటా సీట్లలో 85 శాతం స్థానికులకు, మిగిలిన 15 శాతం సీట్లను స్థానికేతర కోటా కింద కేటాయిస్తారు. 4 నుంచి 10వ తరగతి వరకు ఏడేళ్లలో నాలుగేళ్లు ఇక్కడ చదివితే లోకల్‌గా పరిగణిస్తారు. నాన్‌లోకల్‌ కోటా కింద.. పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వారి పిల్లలకు ఇతర రాష్ట్రాలకు చెందిన, తెలంగాణలో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు కేటాయిస్తారు.