వచ్చే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు!

www.mannamweb.com


వాతావరణ నిపుణుల అంచనా

అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదే

2003 మే 28న 49.9 డిగ్రీలతో రెంటచింతల టాప్‌

ఏప్రిల్‌ చరిత్రలో తిరుపతిలో అత్యధికంగా 45.7 డిగ్రీలు

ఆదివారం 46 డిగ్రీలతో ఆ రికార్డును తుడిచేసిన మార్కాపురం

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణ ఉష్ణోగ్రతలు అరుదుగా నమోదవుతున్నాయి. వేసవిలో రికార్డయ్యే ఈ ఉష్ణోగ్రతలు ఒకింత ఆశ్చర్యం గొలుపుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ఏప్రిల్‌ ఆరంభంలోనే మే నెలను తలపించే వడగాడ్పులు, తీవ్ర వడగాడ్పులు వీస్తున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గడచిన 132 ఏళ్లలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) గణాంకాలను పరిశీలిస్తే.. మన రాష్ట్రంలో నమోదైన గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

1875లో ఐఎండీ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డయిన ఉష్ణోగ్రతలను గమనిస్తే.. 2003 మే 28న రెంటచింతలలో (ప్రస్తుత పల్నాడు జిల్లా) అత్యధికంగా 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే రికార్డు. ఆ తర్వాత స్థానంలో ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నిలిచింది. అక్కడ 1962 మే 26న 48.9 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 2002 మే 11న 48.8, నంద్యాలలో 1994 మే 11న 48.2, మచిలీపట్నంలో 1906 మే 25న 47.8, తునిలో 1998 మే 30న 47.5, విజయవాడలో 1980 మే 26న 47.5, ఒంగోలులో 2003 మే 31న 47.4, నరసారావుపేటలో 1983 మే 2,3 తేదీల్లో 47, నెల్లూరులో 1892 మే 15న, 1894 జూన్‌ 1న 46.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఇలా..
ఏప్రిల్‌ నెలలోనూ అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులున్నాయి. గడచిన పదేళ్లలో (ఏప్రిల్‌లో) 2016 ఏప్రిల్‌ 25న తిరుపతిలో నమోదైన 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతే అత్యధికం. ఈ రికార్డును ఆదివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలో నమోదైన 46 డిగ్రీల ఉష్ణోగ్రత చెరిపేసింది. ఇంకా ఆదివారం నంద్యాల జిల్లా చాగలమర్రి, నెల్లూరు జిల్లా కలిగిరిలో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏప్రిల్‌లో ఎల్‌నినో వంటి ప్రత్యేక పరిస్థితుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు.