టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం ఒక పాలసీ మాత్రమే కాదు, అది మీ కుటుంబం పట్ల మీకున్న బాధ్యత. మీరు లేనప్పుడు మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను ఇది కల్పిస్తుంది. అందుకే సరైన కవరేజీ, పాలసీ కాలపరిమితి, నమ్మకమైన బీమా సంస్థను ఎలా ఎంచుకోవాలో వివరించే సమగ్ర కథనాన్ని ఇక్కడ తెలుసుకోండి..
జీవితం అనేది క్షణాల వ్యవధిలో మారిపోతుంటుంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వారి జీవితాల్లో ఒక్కసారిగా విషాదం అలముకోవచ్చు. తీవ్ర బాధ ఎదురవ్వొచ్చు. ఈ పరిస్థితుల మధ్య.. “మనం లేని సమయంలో మన కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి?” అన్న ప్రశ్న అందరిని భయపెడుతూనే ఉంటుంది. దీనికి సమాధానం.. ‘టర్మ్ ఇన్సూరెన్స్’!
తక్కువ ప్రీమియంతో, కుటుంబానికి ఆర్థిక భద్రతను కల్పించేందుకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది బెస్ట్ ఆప్షన్. అయితే మీ కుటుంబం ప్రస్తుతం ఎలా జీవిస్తోంది? భవిష్యత్తులో వారి అవసరాలు ఎలా ఉండబోతున్నాయి? వంటివి అర్థం చేసుకున్నప్పుడే మీరు సరైన టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోగలరు. ఈ నేపథ్యంలో మీ కుటుంబానికి సరైన టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని తీసుకునే ముందు పరిగణించాల్సిన కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్థిక బాధ్యతలను అంచనా వేయడం పాలసీ
ఆప్షన్లను చూసేముందు, మీ కుటుంబం ఆర్థికంగా దేనిపై ఆధారపడుతుందో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా:
నిత్యం అయ్యే ఇంటి ఖర్చులు
హోమ్ లోన్ లేదా ఎడ్యుకేషన్ లోన్ వంటి ఈఎంఐలు
పిల్లల స్కూల్ లేదా కాలేజీ ఫీజులు
ఆరోగ్య సంరక్షణ, ఇతర ఇన్సూరెన్స్ ఖర్చులు
తల్లిదండ్రులు లేదా ఇతరుల పోషణ
ఈ ఖర్చులు ఎప్పుడూ ఆగవు. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రధాన లక్ష్యం ఈ ఆర్థిక అవసరాలకు రక్షణ కల్పించడమే.
ఎవరు మీ ఆదాయంపై ఆధారపడుతున్నారు?
కుటుంబంలో అందరి అవసరాలు ఒకేలా ఉండవు. కొందరికి నెలవారీ ఖర్చులు అవసరమైతే, మరికొందరికి భవిష్యత్తు అవసరాల కోసం మీ మద్దతు కావాలి.
మీతో పాటు ఆదాయం పంచుకునే భార్య లేదా భర్త
పెరుగుతున్న ఖర్చులతో కూడిన పిల్లల చదువులు
వైద్య సహాయం అవసరమైన వృద్ధులైన తల్లిదండ్రులు
సొంత ఆదాయం లేని ఇతర ఆధారిత వ్యక్తులు
వీరి అవసరాలను బట్టి ఎంత బీమా మొత్తం కావాలి, ఎంత కాలం పాలసీ ఉండాలనేది నిర్ణయించుకోవాలి.
సరైన బీమా కవరేజ్ ఎంచుకోవడం
టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఊహల మీద కాకుండా వాస్తవ అవసరాల మీద ఆధారపడి ఉండాలి.
మీరు సంపాదించే కాలంలో ఎంత ఆదాయం అవసరమో లెక్కించండి
మీకున్న అప్పులు కుటుంబంపై భారం కాకుండా చూసుకోండి
పిల్లల చదువులు వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోండి
కాలక్రమేణా పెరిగే ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయండి. ఇప్పుడు సరిపోతుందనిపించే మొత్తం భవిష్యత్తులో సరిపోకపోవచ్చు. అందుకే కనీస అవసరం కంటే స్థిరమైన భద్రత ఉండేలా చూసుకోవాలి.
పాలసీ కాలపరిమితి
మీ కుటుంబం మీ ఆదాయంపై ఎన్ని సంవత్సరాలు ఆధారపడుతుందో, అన్ని సంవత్సరాల పాటు పాలసీ ఉండాలి.
మీరు ఉద్యోగం లేదా వ్యాపారం చేసే కాలం వరకు కవరేజీ ఉండాలి
అప్పులు తీరే వరకు, పిల్లల బాధ్యతలు పూర్తి అయ్యే వరకు పాలసీని కొనసాగించాలి
చాలా తక్కువ కాలానికి పాలసీ తీసుకుంటే, అది ముగిసిన తర్వాత మళ్లీ కొత్తది తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వయస్సు పెరగడం వల్ల ప్రీమియం ఖర్చులు కూడా భారమవుతాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ పనితీరును అర్థం చేసుకోవడం
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రాథమికంగా ఒక రక్షణ కవచం. సాధారణ టర్మ్ ప్లాన్లలో సేవింగ్స్ లేదా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఉండవు. అయితే కొన్ని ప్లాన్లలో:
ప్రీమియం వెనక్కి వచ్చే ఆప్షన్ (రిటర్న్ ఆఫ్ ప్రీమియం)
ఒకేసారి కాకుండా నెలవారీ ఆదాయంలా వచ్చే పేఅవుట్లు ఇలాంటి వెరైటీలు ఉండవచ్చు. కానీ పాలసీ అసలు లక్ష్యం రక్షణ కల్పించడమేనని గుర్తుంచుకోవాలి.
బీమా సంస్థ విశ్వసనీయత
తక్కువ ప్రీమియం ఉండటం ముఖ్యం కావచ్చు, కానీ నమ్మకం అంతకంటే ముఖ్యం! సంస్థను ఎంచుకునేటప్పుడు:
క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎలా ఉందో చూడండి
సంస్థ ఆర్థిక స్థిరత్వం, సేవల విస్తృతిని గమనించండి
నిబంధనల్లో పారదర్శకత ఉందో లేదో సరిచూసుకోండి
నమ్మకమైన సంస్థను ఎంచుకుంటే, అత్యవసర సమయంలో మీ కుటుంబానికి ఎటువంటి ఒత్తిడి లేకుండా సాయం అందుతుంది.
అవసరమైన ‘రైడర్స్’ చేర్చుకోవడం
టర్మ్ ప్లాన్‌ను మరింత బలోపేతం చేయడానికి రైడర్స్ ఉపయోగపడతాయి. అయితే అనవసరమైన ఖర్చు పెంచేవి కాకుండా, నిజమైన అవసరం ఉన్నవే ఎంచుకోవాలి.
ప్రాణాంతక వ్యాధుల ఖర్చులు
అంగవైకల్యం వల్ల ఆదాయం కోల్పోయే ప్రమాదం
ప్రమాదకర వృత్తి లేదా జీవనశైలి వల్ల కలిగే ముప్పులు
ప్రతి రైడర్‌కు కొంత అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి మీ రిస్క్ ప్రొఫైల్‌కు తగ్గట్టుగా మాత్రమే ఎంచుకోండి.
ప్రీమియం చెల్లింపు విధానం
నెలకు కొంచెం చొప్పున కట్టాలా లేక ఏటా ఒకేసారి కట్టాలా అనేది మీ నగదు లభ్యతను బట్టి నిర్ణయించుకోండి. కొన్ని ప్లాన్లలో పరిమిత కాలం మాత్రమే ప్రీమియం కట్టి, ఎక్కువ కాలం కవరేజీ పొందే సదుపాయం కూడా ఉంటుంది.
పాలసీ పత్రాలను క్షుణ్ణంగా చదవండి
క్లెయిమ్ ఎప్పుడు వర్తించదు, వెయిటింగ్ పీరియడ్ ఎంత, క్లెయిమ్ కోసం ఏమేం పత్రాలు కావాలి వంటి విషయాలను ముందే తెలుసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో మీ కుటుంబం గందరగోళానికి గురికాకుండా ఉంటుంది.
ట్యాక్స్ బెనిఫిట్..
టర్మ్ ఇన్సూరెన్స్ వల్ల ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం పన్ను మినహాయింపులు లభిస్తాయి. కానీ పన్ను ఆదా కోసం మాత్రమే పాలసీ తీసుకోకండి. భద్రత కోసమే పాలసీ తీసుకోవాలి, పన్ను ప్రయోజనం అనేది ఒక అదనపు లాభం మాత్రమే.
చివరిగా.. మీ కుటుంబ అవసరాలు, బాధ్యతలు, మీ ఆర్థిక స్థితిగతుల మధ్య సరైన సమతుల్యత కుదిరినప్పుడే అది ఒక మంచి టర్మ్ ప్లాన్ అవుతుంది. కాస్త సమయం కేటాయించి, బాధ్యతలను విశ్లేషించి సరైన నిర్ణయం తీసుకోండి. ఈ స్పష్టతే మీ కుటుంబ ఆర్థిక పునాదిని పటిష్టంగా ఉంచుతుంది.

































