తెలంగాణ రాష్ట్రంలో 2022లో జారీ చేసిన గ్రూప్1 పోస్టులకు నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరొకటి జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
జి దామోదర్‌రెడ్డితోపాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ పిటీషన్లను దాఖలు చేశారు. జస్టిస్ పుల్లా కార్తీక్ దీనిపై విచారణ చేపట్టగా.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది జె సుధీర్ వాదనలు వినిపించారు. 2022లో 503 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయగా, వివిధ కారణాలతో పరీక్ష రద్దయినట్లు తెలిపారు. నాడు పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకే ఈ నోటిఫికేషన్‌ను పరిమితం చేయాల్సి ఉందన్నారు. 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను కలిపి తాజాగా మరొకటి జారీ చేయడం చెల్లదని పేర్కొన్నారు. అదనంగా చేర్చిన 60 ఖాళీలకు విడిగా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని కోరారు. ఎస్టీ రిజర్వేషన్‌లను 6 నుంచి 10 శాతానికి పెంచడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వం తరపు న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం టీజీపీఎస్సీకి ఉందని పేర్కొన్నారు. అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు మరింత ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను రేపటికి (సెప్టెంబర్ 30) వాయిదా వేశారు.
అక్టోబర్ 3, 4 తేదీల్లో తెలుగువర్సిటీ ప్రవేశ పరీక్షలు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబరు 3, 4 తేదీల్లో ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భట్టు రమేశ్ సెప్టెంబరు 27న ఓ ప్రకటనలో తెలిపారు. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.pstu.cet.org నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యార్ధులకు సూచించారు.
సెప్టెంబర్ 30 నుంచి తెలంగాణ ఐసెట్ 2024 ప్రత్యేక కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సెప్టెంబరు 30 నుంచి ఐసెట్ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు షెడ్యూల్ వెలువరించారు. సెప్టెంబరు 30న ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ ఉంటుంది. అక్టోబరు 1న ధ్రువపత్రాల పరిశీలన, అక్టోబర్ 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు. అక్టోబరు 4వ తేదీలోపు సీట్లు కేటాయింపు ఉంటుందని తెలిపారు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను అక్టోబర్ 6న వెబ్‌సైట్లో ఉంచుతామని తెలిపారు.