బతుకమ్మ మరియు దసరా కోసం TGSRTC 7754 ప్రత్యేక బస్సులు

బతుకమ్మ, దసరా పండగల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్‌ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈ నెల 20 నుంచి అక్టోబరు 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7754 ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో 377 స్పెషల్‌ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. పండక్కి సొంతూళ్లు వెళ్లినవారు తిరుగుపయనమయ్యేందుకు వీలుగా అక్టోబర్‌ 5, 6 తేదీల్లోనూ రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది.


హైదరాబాద్‌లో ప్రధానంగా ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్‌బీ, ఉప్పల్‌ క్రాస్‌రోడ్‌, ఉప్పల్‌ బస్టాండ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, ఆరాంఘర్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కూడా ప్రత్యేక సర్వీసులు నడపనుంది. పండగ స్పెషల్‌ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేయనున్నారు.

గతేడాది కంటే అదనంగా 617 బస్సులు: సజ్జనార్‌

‘‘బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సిద్ధంగా ఉంది. గతేడాది కంటే అదనంగా 617 బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రద్దీ ప్రాంతాల వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచుతారు. పోలీస్‌, రవాణా, మున్సిపల్‌ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ..ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’’ అని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌  తెలిపారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ ను సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో చేసుకోవాలని కోరారు. పూర్తి సమాచారం కోసం టీజీఎస్ఆ‌ర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.