కార్తికమాసాన్ని హిందువులు విశిష్టమైనదిగా భావిస్తారు. కార్తికమాసంలో శివ నామస్మరణతో దేవాలయాలన్నీ మారుమోగుతుంటాయి. ఈ నెల రోజులపాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పరమశివుడికి భక్తులు విశేష పూజలు నిర్వహిస్తారు.
అయితే ఈ పవిత్రమాసంలో భక్తుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా పుణ్యక్షేత్రాలకు చేర్చే విధంగా ప్రణాళికలు రూపొందించింది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ ఐదు రోజుల టూర్ ప్యాకేజీలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖమైన దేవాలయాలను సందర్శించుకోవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన అరుణాచలం ఆలయాన్ని దర్శించుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని ఈ అరుణాచల క్షేత్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివెళ్తుంటారు. దీంతో తక్కువ ధరకే ప్రయాణికుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ఈ టూర్ ను తీసుకొచ్చింది. అరుణాచలం దర్శనానికి భూపాలపల్లి ఆర్టీసీ డిపో నుంచి ఈ నెల 18వ తేదీ రాత్రి 8 గంటలకు సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణం కానుందని అధికారులు తెలిపారు. 40 మంది భక్తులు కలిసి వెళ్లొచ్చు. మొత్తం ఐదు రోజుల టూర్ కు ఒక్కొక్కరికి టికెట్ ధర రూ. 5,300 గా నిర్ణయించారు. ఈ టూర్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 97019 67519, 99592 26707 నంబర్లకు సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
అరుణాచలం టూర్ కు మాత్రమే కాకుండా విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం, పిఠాపురంలోని పురహూతికాదేవి ఆలయం, సామర్లకోటలో కుమారరామ భీమేశ్వర ఆలయం, రాజమండ్రి ఘాట్.. సందర్శనకు కూడా ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. అలాగే ఏపీలోని అన్నవరం ఆలయానికి కూడా బస్సు సర్వీసు ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 12 రాత్రి 9 గంటలకు భూపాలపల్లి డిపో నుంచి ఉంటుంది. ఒక్కొక్కరికి రూ. 2,300 గా టికెట్ ధర నిర్ణయించారు. అలాగే మూడు రోజుల పాటు వైజాగ్ టూర్ కూడా ఉంటుందని డిపో అధికారులు తెలిపారు పూర్తి వివరాల కోసం 97019 67519, 99592 26707 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
































