మీరు ఏదైనా దేవాలయానికి వెళ్లాలని నిశ్చయించుకుంటే వెళ్లి దర్శనం చేసుకుంటారు. కానీ ఈ ఆలయానికి మీరు వెళ్లాలని అనుకున్నా కూడా.. అక్కడి స్వామి వారి పర్మిషన్ తప్పక ఉండాల్సిందే.
స్వామి అంటే ఆలయ అర్చకులు అనుకుంటే పొరపాటే. ఔను మీరు అనుకున్నది నిజమే.. అక్కడ వెలసిన స్వామి వారి అనుమతి లేనిదే మీరు ఆలయానికి వెళ్లలేరు. ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే మీరు ఆలయానికి చేరుకోగలుగుతారు. లేకుంటే దారి తప్పి మీ ఇంటికి మాత్రం చేరుకుంటారు. ఇంతటి మహిమాన్విత ఆలయం ఎక్కడో ఉందని మాత్రం అనుకోవద్దు. తెలంగాణ లోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో ఈ ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయం ఓ అద్భుతం అంటారు అక్కడి భక్తులు. ఆ ఆలయ చరితం మీకోసం.
మనదేశంలో ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆలయ చరితం తెలుసుకొని విదేశీయులు కూడా మన ఆలయాలను సందర్శిస్తున్న రోజులివి. ఇలా తెలంగాణలో వెలసిన ఈ ఆలయం చరితం, మహిమలు తెలుసుకుంటే చాలు మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. కానీ అక్కడి స్వామి వారి అనుమతి ఉండాల్సిందే. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయమే ఇది. ఈ ఆలయంను కాకతీయ రాజుల కాలం ముందు నిర్మించారని చరిత్ర చెబుతోంది. 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు కూడా ఇక్కడి స్వామి వారిని పూజించనిదే తమ రోజును ప్రారంభించే వారు కాదట.
900 ఏళ్ల చరిత్ర ఉన్న గల ఈ ఆలయం మహిమలు తెలుసుకుంటే చాలు.. ఆ స్వామి అనుగ్రహం కోసం మీరుకూడా పరితపిస్తారు. ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు దక్షిణ ముఖముగా స్వయంభువుగా వెలిశారు. ఈ ఆలయ కట్టడాలను పరిశీలిస్తే ఎంతో పురాతన, ప్రాచీన శిల్పకళా ఖండాలు మనకు కనిపిస్తాయి. ఈ ఆలయ దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా గోదారమ్మ నీటి పరవళ్లలో పవిత్రస్నానం ఆచరించి, స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో నిద్రిస్తే చాలు.. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఇక్కడి వింతలు.. అద్భుతాలు..
సాధారణంగా మీరు తలుచుకుంటే ఈ ఆలయాన్ని దర్శించలేరట. ఆ స్వామి అనుగ్రహం మీకు కలిగిన యెడల మీకు స్వామి దర్శనం లభిస్తుంది. కొన్నేళ్ల క్రితం ఓ భక్తుడు స్వామి వారి దర్శనార్థం ఆలయం వద్దకు వెళ్లారట. ఆ సమయంలో ఆలయం వెలుపల కళ్లు తిరిగి పడిపోయారట ఆ భక్తుడు. అక్కడి అర్చకులు అప్పుడు అసలు విషయం చెప్పారట. ఇక్కడి స్వామి వారి అనుగ్రహం ఉంటేనే ఆలయంలోకి ప్రవేశం లభిస్తుందని, లేకుంటే మధ్యలోనే దారి తప్పడమో లేకుంటే ఇలా కళ్లు తిరిగి పడిపోవడం జరుగుతుందని చెప్పారట. అలా ఇక్కడి స్వామి వారి అనుగ్రహం అందరు భక్తులకు కలగాలని ఆశిద్దాం.
5 రోజులు లేదా 11 రోజులు నిద్రిస్తే వారి ఆరోగ్య సమస్యల నుంచి భాదల నుంచి విమక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. సుమారు వందల సంఖ్యలో ఇక్కడ స్వామి సన్నిధిలో నిద్రకు వస్తారు. అలా నిద్రకు వచ్చే వారికి సౌకర్యాలను ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. ఈ ఆలయంలో దీక్షకు పూనుకునే వారికి స్వామి వారు కలలోకి వచ్చి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వెళ్తాడట. స్వప్నంలోనే వారి సమస్యలు తీరుతాయని ఇక్కడి ఆలయానికి వచ్చే భక్తుల నమ్మకం. కోరుకున్న కోరికలు నేరినవారు 108 కొబ్బరికాయలు సమర్పించుకుంటారు.
మరికొంతమంది తమ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ముడుపులు చెల్లించుకుంటారు. ఈ లక్ష్మీసమేత నృసింహ ఆలయంలో వివాహాలు చేసుకుంటే ఎప్పటికీ కలిసే ఉంటారని ఆయురారోగ్యాలు, పిల్లాపాపలతో సంతోషాలతో జీవిస్తారని నమ్మకం. ఈ ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను కూడా జరిపిస్తారు.ఒక పెద్ద పల్లి జిల్లా అని కాకుండా పక్క జిల్లాల నుంచి వచ్చి కూడా ఇక్కడ శుభకార్యాలు చేసుకుంటారు.
అంతేకాదు ఇక్కడ 5 రోజులు, 11 రోజులు నిద్ర చేసిన వారి కలలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనమిచ్చి, మీ సమస్య తీరిపోయింది ఇక మీరు వెళ్ళవచ్చని ఆదేశిస్తారట. దీనిని బట్టి చెప్పవచ్చు ఈ స్వామి వారి శక్తి. అందుకే కాబోలు ఈ ఆలయం నిరంతరం భక్తులతో కిటకిటలాడుతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాదు.. పలు రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా సుందిల్ల గ్రామానికి చేరుకొని స్వామి వారిని దర్శిస్తున్నారు. మరి మీకు ఈ స్వామి వారి దర్శన భాగ్యం కలిగిందా.. మీ జన్మజన్మల పాపాలు కూడా హరిస్తాయని కూడా ఇక్కడి భక్తుల విశ్వాసం. నిశ్చలమైన భక్తితో స్వామి వారి అనుగ్రహం కోసం పరితపించండి.. ఆ స్వామి అనుగ్రహిస్తాడని ఆలయ అర్చకులు తెలిపారు.