ఉద్యోగులకు ఆ టాప్ టెక్ కంపెనీ షాక్.. ఆ రోజుల్లో కచ్చితంగా ఆఫీస్‌కు రావాల్సిందే..!

www.mannamweb.com


2020లో భారతదేశంలో కరోనా సృష్టించిన విలయాన్ని ఎవరూ మర్చిపోలేరు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 అంటే ఉలిక్కిపడతారు. ముఖ్యంగా లాక్‌డౌన్ అంటే ఎలా ఉంటుందో?

ప్రజలు ఆ సంవత్సరంలోనే చూశారు. అయితే కరోనా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త పని విధానాన్ని నేర్పింది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని టాప్ టెక్ కంపెనీలన్నీ అనుసరించాయి. ఈ విధానం ఉద్యోగులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కానీ కరోనా తగ్గుముఖం పట్టినా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్నే కోరుకుంటున్నారు. ఆఖరికి కంపెనీలు ఉద్యోగుల ఒత్తిడికి తలొగ్గి మరికొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కొన్ని టాప్ టెక్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని రద్దు చేశాయి. మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో సర్దుబాటు చేస్తూ హైబ్రిడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజా ప్రముఖ కంపెనీ హెచ్‌సీఎల్ హైబ్రిడ్ విధానాన్ని సవరిస్తున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు షాక్ ఇచ్చేలా హెచ్‌సీఎల్ తీసుకున్న నిర్ణయం గురించి వివరాలను తెలుసుకుందాం.

భారతదేశంలోని మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు అయిన హెచ్‌సీఎల్ టెక్, ఉద్యోగి సెలవులను వారి కార్యాలయ హాజరుతో అనుసంధానించే కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విధానం ప్రకారం ఉద్యోగులు వారానికి మూడు రోజులు, కనీసం నెలలో 12 రోజులు ఆఫీసు నుండి పని చేయాలి. ఈ రూల్‌ను ఉద్యోగులు బ్రేక్ చేస్తే వారు హాజరుకాని రోజుల్లో జీతంలో కోతపడనుంది హెచ్‌సీఎల్ టెక్ హైబ్రిడ్ వర్క్ మోడల్‌కి మారిన ఐదు నెలల తర్వాత ఈ చర్య తీసుకున్నారు. ఈ తాజాగా నిర్ణయంతో ఉద్యోగులు తప్పనిసరిగా వారానికి మూడు రోజులు కార్యాలయానికి తిరిగి రావాల్సి ఉంటుంది. హెచ్‌సీఎల్ హెచ్ఆర్ విభాగం ఈ అప్‌డేట్ గురించి ఉద్యోగులకు ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా ఈ విషయం తెలియజేయడం ప్రారంభించింది.

ప్రస్తుతం హెచ్‌సీ టెక్ మూడు సంవత్సరాల కంటే తక్కువ కాలం పాటు కంపెనీలో ఉన్న ఉద్యోగులకు 18 వార్షిక సెలవులు, ఒక వ్యక్తిగత సెలవును అందిస్తుంది. మూడు సంవత్సరాల కంటే ఎక్కువ పదవీకాలం ఉన్నవారు దాదాపు 20 వార్షిక సెలవులు, రెండు వ్యక్తిగత సెలవులను పొందుతారు. హైబ్రిడ్ వర్క్ పాలసీ ప్రకారం మధ్య, సీనియర్ స్థాయి మేనేజ్‌మెంట్‌లోని వ్యక్తులు వారానికి 3 రోజుల పనిని కార్యాలయం నుంచి చేయాల్సి ఉంటుందని, ఉద్యోగులందరికీ ఈ విధానమే అమల్లో ఉంటుందని హెచ్‌సీఎల్ ప్రతినిధులు చెబుతున్నారు. గత వారం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ నికర లాభం సంవత్సరానికి 20.45 శాతం పెరిగి రూ.4,257 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్-జూన్ 2024లో కార్యకలాపాల ద్వారా దాని ఆదాయం 6.69 శాతం పెరిగి రూ. 28,057 కోట్లకు చేరుకుంది.