గత కొన్నాళ్లుగా ఐసీసీ టోర్నీల్లో కీలక మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన టీమ్‌ఇండియా.. టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం ఆ సీన్‌ను రిపీట్ కానివ్వలేదు. లీగ్ దశ నుంచి వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ వరకు అదే జోరు కొనసాగించి విశ్వవిజేతగా నిలిచింది. బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమ్ఇండియా 11 ఏళ్ల తర్వాత మరో ఐసీసీ టైటిల్‌ను ముద్దాడింది. ఫైనల్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పిచ్‌పై ఉన్న మట్టిని తిన్న సంగతి తెలిసిందే. ఆ మట్టిని ఎందుకు తిన్నాననే విషయాన్ని రోహిత్ శర్మ తాజాగా వెల్లడించాడు.
‘‘ఆ (బార్బడోస్) పిచ్‌పై మనం ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ట్రోఫీ సాధించాం. ఈ పిచ్ నాకు ఎంతో ప్రత్యేకం. ఈ మైదానాన్ని, పిచ్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటా. దాన్ని (పిచ్) నాలో భాగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ మట్టిని నోట్లో వేసుకున్నా. ఈ మూమెంట్స్ చాలా ప్రత్యేకమైనవి. ఇక్కడ మా కల నెరవేరింది’’ అని రోహిత్ శర్మ తెలిపాడు.
ప్రపంచకప్ సాధించామనే ఫీలింగ్ నమ్మశక్యంగా లేదని, ఫైనల్ మ్యాచ్ ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు అంతా ఒక కలలా అనిపిస్తోందని భారత కెప్టెన్ చెప్పాడు. తెల్లవారుజాము వరకు ఆటగాళ్లందరం కలిసి సంబరాలు చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ గెలవడం ఎంతో ప్రత్యేకమైనదని, ఈ విజయాన్ని తాను ఇంకా పూర్తిగా ఆస్వాదించలేదని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు.