కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీలో మహిళల ఆర్థిక బలోపేతం కోసం చాలా చర్యలు తీసుకుంటోంది. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
ఇందులో భాగంగా డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది.
ఆర్థికంగా మహిళలకు చేయూత అందించేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు స్త్రీ నిధి, బ్యాంక్ లింకేజీ రుణాలు అందిస్తోంది. గతంలో స్త్రీ నిధి రుణాలపై 12 శాతం, బ్యాంక్ లింకేజీ రుణాలపై 13 శాతం వడ్డీ ఉండేది. ఇప్పుడు కొత్త నిర్ణయంతో స్త్రీ నిధి రుణాలపై 10 శాతం, బ్యాంక్ లింకేజీ రుణాలపై 11 శాతం వడ్డీ మాత్రమే చెల్లించాలి.
పావలా వడ్డీ పథకం కింద గతంలో 3 లక్షల రూపాయల వరకు మాత్రమే తక్కువ వడ్డీ వర్తించేది, కానీ ఇప్పుడు ఎంత రుణం తీసినా ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మహిళలకు ఆర్థిక ఊరట లభిస్తుంది.
అలాగే, డ్వాక్రా సంఘాల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం మన డబ్బులు-మన లెక్కలు అనే యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా సభ్యులు తమ రుణాలు, వాయిదాలు, పొదుపు వివరాలను సులభంగా చూసుకోవచ్చు. దీంతో ఆర్థిక లావాదేవీలు స్పష్టంగా ఉండి, అక్రమాలు తగ్గుతాయి.
































